IT Raids on Ponguleti Srinivas Reddy : పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఐటీ దాడులు(IT Raids) చర్చనీయాంశంగా మారాయి. ఏకకాలంలో పొంగులేటి(Ponguleti) నివాసాలు, కుటుంబీకులు, బంధువులు ఇళ్లు, వ్యాపార సంస్థలకు చెందిన కార్యాలయాలపై ఐటీ అధికారుల మూకుమ్మడి దాడులు కలకలం రేపాయి. గురువారం తెల్లవారు జామునే ఖమ్మంలోని నివాసానికి మొత్తం 8 ప్రత్యేక వాహనాల్లో పొంగులేటి నివాసానికి చేరుకున్న ఐటీ అధికారుల బృందం ఇంట్లో సోదాలు నిర్వహించింది.
మొత్తం 15 మంది ఐటీ అధికారులు, 10 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది పొంగులేటి ఇంటికి చేరుకున్నారు. అధికారులు వచ్చిన సమయంలో పొంగులేటి ఆయన కుటుంబసభ్యులు అంతా ఇంట్లోనే ఉన్నారు. పొంగులేటి కుటంబసభ్యులు, సిబ్బంది అందరి నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోని అన్ని గదుల్లో తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా ఐటీ రిటర్న్స్‌కు సంబంధించిన పత్రాలు, పలు డాక్యుమెంట్లు క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిసింది. వీటితోపాటు రాఘవా కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం.
IT Raids in Raghava Constructions Today : ఈ సందర్భంగా పత్రాలు, డాక్యుమెంట్లకు సంబంధించి పొంగులేటికి ఐటీ అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ఖమ్మం నివాసంలో సోదాలు జరుగుతున్న సమయంలోనే ఖమ్మం జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఆయన నివాసాలు, కార్యాలయాలపైనా ఐటీ దాడులు కొనసాగాయి. ఖమ్మం నగరంలోని పొంగులేటి కుటుంబీకులకు చెందిన నివాసాలు, బంధువుల ఇళ్లు, ఎస్ఆర్ కన్వెన్షన్, రాఘవా కన్స్ట్రక్షన్స్ కార్యాలయాలతోపాటు పొంగులేటి స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలోని ఆయన ఇంటిలోనూ ఏకకాలంలో దాడులు జరిగాయి.
పొంగులేటి వియ్యంకుడు రఘురాంరెడ్డి హైదరాబాద్ నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయా చోట్లా ఎక్కడా బయటి వారిని లోపలికి వెళ్లనీయకుండా, లోపలి నుంచి ఎవరూ బయటకు రాకుండా పటిష్ఠ బందోబస్తు విధించారు. పొంగులేటి నివాసంపై ఐటీ దాడులు జరుగుతున్నయన్న సమాచారం తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు భారీగా పొంగులేటి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఐటీ సోదాలు ఉదయం 5 గంటలకు మొదలవ్వగా.. దాదాపు 5 గంటల పాటు పొంగులేటి ఇంటి నుంచి ఎవరూ బయటకు రాలేదు. 11 గంటల సమయంలో పొంగులేటి బయటకు వచ్చి నాయకులు, కార్యకర్తలను కలిశారు.
Ponguleti fires on KCR : "కేసీఆర్.. రైతులను ఎందుకు కోటీశ్వరులను చేయడం లేదు"
Congress Paleru Candidate Ponguleti Srinivasreddy : ఐటీ అధికారుల అనుమతితో నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. పాలేరు కాంగ్రెస్(Congress) అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరారు. అనంతరం ఖమ్మం గ్రామీణంలో ఆర్వో కార్యాలయంలో పొంగులేటి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మళ్లీ ఐటీ అధికారుల ఆదేశాల మేరకు ఖమ్మంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై తనపై దాడులు చేయించాయని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, భయభ్రాంతులకు గురిచేసేందుకు ఎన్ని దాడులు చేసినా.. చివరకు తనను జైళ్లో పెట్టినా ఒక్క అడుగు కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. నిరంకుశ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు విశ్రమించబోనన్నారు. నామినేషన్ వేసే రోజే కావాలని ఉద్దేశపూర్వకంగా భయభ్రాంతులకు గురిచేసేందుకు దాడులకు తెరలేపారని అన్నారు.
Ponguleti fires on BRS and BJP : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న ప్రచారం సాగుతుండటంతో జీర్ణించుకోలేకనే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా ఈ దాడులు చేయిస్తున్నాయన్నారు. బీజేపీకి బీ- టీమ్ గా ఉన్న బీఆర్ఎస్(BRS) ఆదేశాల మేరకే ఈ దాడులు జరుగుతాయని తమకు ముందే తెలుసన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఏడాది పాటు జైలు శిక్షకైనా సిద్ధమేనన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపనట్లుగానే.. కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు ఎన్ని కుప్పిగంతులు వేసినా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరన్నారు.
ఖమ్మంలోని పొంగులేటి నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. తదుపరి విచారణ కోసం హైదరాబాద్ రావాలని.. పొంగులేటి కుటుంబీకులకు ఐటీ అధికారులు సూచించారు. ఐటీ అధికారుల సూచనతో పొంగులేటి సతీమణి, కుమారుడు, సోదరుడు హైదరాబాద్‌కు బయల్దేరారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఐటీ దాడులున్నాయని పొంగులేటి విమర్శించారు. వందల మంది ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారని.. 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసినా ఏమీ దొరకలేదని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా ఐటీ దాడులకు పురిగొల్పాయని మండిపడ్డారు.
"కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై దాడులు చేయించాయి. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులకు, భయభ్రాంతులకు గురిచేసేందుకు ఎన్ని దాడులు చేసినా.. చివరకు తనను జైళ్లో పెట్టినా ఒక్క అడుగు కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు". - పొంగులేటి, కాంగ్రెస్ నేత
పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు - నామినేషన్‌ను అడ్డుకుంటున్నారని ఈసీకి ఫిర్యాదు