ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అక్రమాల వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది. డీసీసీబీలో భారీగా అక్రమాలు జరిగినట్లు సహకారశాఖ నిగ్గుతేల్చిన అనంతరం పరిణామాలు.. అటు బ్యాంకులో..ఇటు రాజకీయంగా రోజుకో రకంగా మలుపులు తిరుగుతున్నాయి. మాజీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి వసంతరావు కారణంగా.. రూ. 7 కోట్ల 32 లక్షల బ్యాంకు నిధులు దుర్వినియోగమైనట్లు సహకారశాఖ తేల్చింది.
సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులను మోసం చేసి.. వివిధ పేర్లతో వారి నుంచి సొమ్ము వసూలు చేయడానికి మాజీ ఛైర్మన్, సీఈవోలే కారణమని పేర్కొంది. ఓ ట్రస్టును ఏర్పాటు చేసి.. రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు సాయం చేస్తామని ప్రకటించడం నిబంధనలకు విరుద్ధమని వివరించింది. ట్రస్టు ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయడాన్నీ తీవ్రంగా తప్పుబట్టింది. దుర్వినియోగమైన మొత్తాన్ని.. మాజీ ఛైర్మన్, సీఈవో, డైరెక్టర్ల నుంచి వసూలు చేయాలని నివేదిక సిఫారసు చేసింది. ఆస్తుల స్వాధీనానికి త్వరలోనే నోడల్ అధికారిని నియమించేందుకు సిద్ధమవుతోంది.
మరోవైపు డీసీసీబీలో అవినీతికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ప్రస్తుత పాలకవర్గం తీర్మానం చేయడంతో.. ప్రస్తుత, మాజీ డైరెక్టర్లలో గుబులు మొదలైంది. గత పాలకవర్గంలో పనిచేసిన వారిలో ప్రస్తుత డైరెక్టర్లు కొందరున్నారు. తమ పదవులు ఉంటాయా.. ఊడతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఛైర్మన్ తీసుకున్న నిర్ణయాలతో పాలకవర్గం మొత్తాన్ని బాధ్యులుగా చేయడాన్ని డైరెక్టర్లు ఖండిస్తున్నారు. అప్రమత్తం చేయాల్సిన అధికార యంత్రాగం నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని ఆరోపిస్తున్నారు. నిధుల దుర్వినియోగం నేపథ్యంలో బ్యాంకు భవిష్యత్‌పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ప్రస్తుత పాలకవర్గం మాత్రం మళ్లీ బ్యాంకుకు పూర్వవైభవం తీసుకొస్తామంటోంది.
ఇదీ చదవండి: పౌరహక్కుల నేతల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు