మాంసం తినని వాళ్లు కూడా కోడిగుడ్డు తింటారు. ఉడికించిన గుడ్డు, ఆమ్లెట్ రూపంలో, పలు రకాల ఆహార పదార్థాల్లో దీనిని వినియోగిస్తారు. ఉడికించిన గుడ్డుతో ఎంతో ప్రయోజనం ఉందని వైద్యులు చెబుతున్నారు. మాంసానికి ప్రత్యామ్నాయంగా కూడా దీనిని భావించవచ్చు. మాంసం అరుగుదలకు ఎక్కువ సమయం తీసుకోవడంతోపాటు, సరైన శారీరక శ్రమ లేకుంటే కొవ్వు పేరుకుపోతుందన్న వాదన ఉంది. కానీ గుడ్డు తేలికగా జీర్ణం అవడంతోపాటు తక్షణ శక్తిని అందిస్తుంది.
ఉభయ జిల్లాల్లో..
కరోనా నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మాంసంతోపాటు గుడ్డు వినియోగం భారీగా పెరిగింది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు రోగనిరోధక శక్తి పెంచుకోవాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు తక్కువ ధరకు లభించే గుడ్డును ఆహారంలో తీసుకుంటున్నారు .జిల్లాలోని రఘునాథపాలెం, వేంసూరు, వీఎం బంజర, మధిర, ఎర్రుపాలెం తదితర ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లో గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. జిల్లా అవసరాలకు ఎక్కువగా వరంగల్, కృష్ణా జిల్లాల నుంచి సరఫరా అవుతాయి. జిల్లాలో 15 మంది హోల్‌సేల్ విక్రయదారులున్నారు. వీరి ద్వారా గతంలో ఉమ్మడి జిల్లాలో రోజుకు 3-3.5లక్షల వరకు కోడిగుడ్ల విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం రోజుకు 5 లక్షలకుపైగా విక్రయిస్తున్నారు. ఖమ్మం నగరంలోనే 3 వేల ట్రేల(90వేల) గుడ్ల విక్రయాలు జరుగుతున్నాయి. గతంలో ఏడాదికి 180 గుడ్ల తలసరి వినియోగం ఉండేదని, ప్రస్తుతం ఇది 280కి చేరుకుందని నిపుణులు చెబుతున్నారు.
డిమాండ్ నేపథ్యంలో గుడ్డు ధర స్వల్పంగా పెరిగింది. గతంలో రిటైల్‌గా రూ.5-5.50కు లభించిన గుడ్డు ప్రస్తుతం రూ.6 అయ్యింది. మారుమూల గ్రామాల్లోనూ దుకాణాల్లో గుడ్డు విక్రయాలు పెరిగాయి. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన కొందరు ఆటో డ్రైవర్లు సైతం గుడ్లు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో ఇళ్లముందుకు వెళ్లి గుడ్లు విక్రయిస్తున్నారు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
పప్పు, గుడ్డుతో మనిషికి కావాల్సిన పోషకాలు అంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుడ్డును ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. దీని ద్వారా అందే ప్రోటీన్స్‌తో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. కోలెస్ట్రాల్ ఉన్నవారు పచ్చసొన తినడం తగ్గిస్తే చాలు.- డా.జి.వెంకటేశ్వర్లు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టు
ఇదీ చూడండిః శంకర్‌పల్లిలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం