ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురవటంతో అన్నదాతలు ఈసారి సాగు పెంచారు. వ్యవసాయ శాఖ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉభయ జిల్లాల్లోనూ సాగు.. లక్ష్యానికి చేరువలో ఉంది. ఖమ్మం జిల్లాలో ఈ సీజన్లో మొత్తం 5,96, 149 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా ఉండగా.. ఇప్పటికే లక్ష్యం దాదాపు పూర్తి కావచ్చింది. జిల్లాలో అన్ని పంటలు కలిపి 4,30,015 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈసారి పంటల సాగు లక్ష్యం 4,61,850 ఎకరాలు ఉండగా.. ఇప్పటి వరకు 4,10,950 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో వరి, పత్తి, మిర్చి, కంది, మొక్కజొన్న, పెసర పంటలు సాగులో ఉన్నాయి. రైతులు ఈ పంటలకు అధికంగా యూరియా వినియోగిస్తారు. ఇదే అదునుగా మలుచుకుంటున్న కొంతమంది వ్యాపారులు ఎమ్మార్పీ ధరల విక్రయాలను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా యూరియా అమ్మకాలు సాగిస్తున్నారు.
అందుబాటులో ఉన్నా అధిక ధర
రెండు జిల్లాలకు అవసరమైన యూరియా అందుబాటులోనే ఉంది. ఖమ్మం జిల్లాలో ఈ సీజన్ లో 80,718 మెట్రిక్ టన్నులు అవసరం ఉంది. ఇప్పటి వరకు జిల్లాకు 30,024 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సారి 50,800 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. ఇప్పటి వరకు జిల్లాకు 27,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయింది. బస్తా యూరియాపై ప్రభుత్వం నిర్దేశించిన వాస్తవ ధర రూ. 266గా ఉంది. సహకార సంఘాలు, గ్రోమోర్ హోల్ సేల్ డీలర్లు, ఇతర ప్రైవేటు దుకాణాల్లోనూ ఎమ్మార్పీ ధరలకే అమ్మాలన్న నిబంధనలు ఉన్నాయి. కానీ ఉభయ జిల్లాల్లోనూ కొంతమంది ప్రైవేటు వ్యాపారులు యూరియా ధరలను అమాంతం పెంచేశారు.
330 నుంచి 360 రూపాయలు వసూలు
ఎమ్మార్పీకే అమ్మాలన్న నిబంధనలను తుంగలో తొక్కి అధిక ధరలకు యూరియా విక్రయాలు చేస్తున్నారు. 45 కిలోల యూరియా బస్తాను ఏకంగా 330 నుంచి 360 రూపాయలకు అమ్ముతున్కాన్నారు. ఇదేంటని రైతులు ప్రశ్నిస్తే యూరియా దిగుమతికి అధిక ఖర్చు అవుతుందని కొందరు, నిల్వ పాయింట్లు లేక పెంచాల్సి వస్తుందని ఇంకొకరు ఇలా వ్యాపారులు రకరకాల సాకులు చెబుతున్నారు. గరిష్ఠ ఎమ్మార్పీ ధరపై అదనంగా 60 నుంచి 80 వరకు అధికంగా రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. వీటికి తోడు హమాలీ ఛార్జీలు రైతులు అదనంగా భరిస్తూనే ఉన్నారు.
అధికారులు దృష్టి సారించాలి
రైతులు ఎరువులు, పురుగు మందులు తీసుకున్నప్పుడు కచ్చితంగా వాటికి సంబంధించిన బిల్లులు ఇవ్వాలి. కొందరు ప్రైవేటు వ్యాపారులు తీసుకున్న ఎరువులకు బిల్లులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఒకవేళ రశీదు ఇచ్చినప్పటికీ అందులో మాత్రం ఎమ్మార్పీ ధరలకే విక్రయించినట్లుగా బిల్లులు ఇస్తున్నారు. రైతులు నుంచి వసూలు చేసేది మాత్రం అదనంగానే ఉంటుంది. వ్యవసాయశాఖ అధికారులు ప్రైవేటు వ్యాపారాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తేనే రైతులకు కొంతలో కొంతైనా మేలు జరిగే అవకాశం ఉంది. లేకపోతే అన్నదాతలపై అదనపు బాదుడుకు అడ్డుకట్టపడేలా కనిపించడం లేదు.
ఇదీ చదవండి: Bandi sanjay : 'నిజాలు మాట్లాడితే.. విద్వేషాలు రెచ్చగొట్టినట్లా?'