వరుణుడి ప్రతాపంతో రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. నగరంలోని అనేక కాలనీలు జలదిగ్భందం అయ్యాయి. హన్మకొండ, కాజీపేట, వరంగల్‌లో... పలు కాలనీలు..జలదిగ్భందనలోనే ఉన్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. బాధితులకు సాయంగా నిలుస్తామని హామీ ఇచ్చారు. 25 మంది జాతీయ విపత్తు సహాయ బృందంతో చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆదివారం సుమారు 2,600మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని వాగులు వరదనీటితో ఉప్పొంగుతున్నాయి. ఆకేరు, మున్నేరు,పాకాల, బంధం, వట్టి వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దంతాలపల్లి మండలంలోని పాలేరు వాగు ఉప్పొంగుతోంది.
నీటమునిగిన పంటలు
బయ్యారం మండలం కొత్తపేట, కురవి మండలం మోదుగుల గూడెంలలో రెండు ఇళ్లు కూలిపోయి ఆస్తి నష్టం సంభవించింది. వేలాది ఎకరాలలో వరి పంట నీట మునిగింది. ఇతర పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొత్తగూడ మండలంలోని వాగులు.... వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని ముగ్గురు గర్భీణులు నొప్పులతో ఇబ్బందులు పడ్డారు. అంబులెన్స్‌కు సమాచారం అందించిన....కొత్తపల్లి వాగు ప్రవహిస్తుండడం వల్ల వెళ్ల లేకపోయాయి. స్థానికులు గర్భిణులను ట్రాక్టర్‌పై ఎక్కించి వాగు దాటించారు.
జనగామ పట్టణ శివారులోని చిట్టకోడూరు జలాశయం పూర్తి స్థాయిలో నిండటంతో డ్యాం మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నర్మెట్ట మండలంలోని గండి మల్లన్న జలాశయం నిండటంతో 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
ఎన్నడూ లేనంతగా...
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వర్షపాతం నమోదమవుతోంది. ప్రధానంగా ఏజెన్సీ మండలాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంత గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. జీపిపల్లి గోదావరి వద్ద 6గురు కూలీలు వరదలో చిక్కుకోగా.... సహాయక సిబ్బంది కష్టం మీద వారిని రక్షించారు. మణుగూరు మండలంలోని పేరంటాల చెరువుకు గండి పడి పగిడేరుకు రాకపోకలు నిలిచాయి. కరకగూడెం మండలంలో ఒర్రె వాగు పొంగడంతో గిరిజన గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. సీతారామ ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయి...ప్రాజెక్టు ప్రధాన కాల్వలోకి భారీగా వరద నీరు చేరుకుంది. పాలేరు, వైరా, లంకసాగర్, కిన్నెరసాని, తాలిపేరు, పెద్దవాగు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చిచేరుతుండతంతో... దిగువకు నీటివిడుదల కొనసాగుతోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత మున్నేరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. సూర్యాపేట- ఖమ్మం, ఖమ్మం-బోనకల్ మార్గాల్లో రాకపోకలు నిలిపివేశారు.
రైతులను నిండా ముంచింది
వైరా జలాశయం నీటి సామర్థ్యం 18 అడుగులు కాగా .. అలుగుల నుంచి వరదనీరు దిగువకు చేరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అలుగు పోస్తున్న చెరువుల్లో ఏర్పాటు చేసిన వలలు కొట్టుకుపోవడంతో కారేపల్లి పెద్దచెరువులో 20 క్వింటాళ్ల చేపలు కొట్టుకుపోయాయని మత్స్యకారులు వాపోతున్నారు. ఏన్కూరు, జూలూరుపాడు, వైరా మండలంలో వరి, పత్తి, మిరప పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయి. భారీవరదలకు అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌లో 1077 టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. నేలకొండపల్లి మండలం బాలసముద్రం చెరువుకు గండి పడంటంతో... సమీప ప్రాంత పొలాలు నీట మునిగాయి.
ఇల్లుకూలి తల్లీ కుమార్తె మృతి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎడతెరపిలేని వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వానలకు జలాశయాలు, చెరువులు, వాగులు నిండి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కోయల్ సాగర్, రంగసముద్రం, శంకర సముద్రం, రామన్ పాడు, సంగంబండ జలాశయాలు నిండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇల్లు కూలి తల్లికూతుళ్లు మృత్యువాత పడ్డారు. కొత్తకోట-ఆత్మకూర్, అప్పరాల- తిప్పడంపల్లి, రేచింతల-శాఖపూర్, చిన్నచింతకుంట- అమ్మాపూర్ రహదారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కల్వకుర్తిలో వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సును జేసీబీ సాయంతో బయటకు తీశారు. వనపర్తి నల్లచెరువు అలుగు పారడంతో ఖిల్లాగణపురం ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో వర్షాల ప్రభావంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
ఇదీ చూడండి : రెడ్‌క్రాస్ వాలంటీర్లు సహాయ చర్యల్లో పాల్గొనాలి: గవర్నర్