Peach in Hyderbad Biryani : బిర్యానిలో అంట్లు తోమే పీచు ముక్కలు రావటంతో ఇదేంటని అడిగిన పాపానికి కస్టమర్లపై హోటల్ నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. ఎస్సై మధుసూదన్‌రెడ్డి ఆదివారం (డిసెంబరు 22న) తెలిపిన వివరాల ప్రకారం చేవెళ్ల మండలం రేగడిఘనాపూర్కు చెందిన బేగరి శంకర్, మహేందర్, నాగరాజు, సురేశ్, మరో ఇద్దరు కలుసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం పూడూరు మండలంలోని అంగడిచిట్టంపల్లిలోని ఓ హోటల్‌లో భోజనం చేసేందుకు హైదరాబాద్ బిర్యానీ ఆరుగురి కోసం ఆర్డర్ ఇచ్చారు.
దాంట్లో అంట్లు తోమే సబ్బుకు ఉపయోగించే ఇనుప పీచు ముక్కలు రావటంతో అవాక్కయ్యారు. వాటిని గుర్తించిన వెంటనే హోటల్ నిర్వాహకులను నిలదీశారు. దానికి బదులుగా వేరే అన్నం ఇస్తామని చెప్పారు. అయినా మళ్లీ సరైనది ఇవ్వక పోవటంతో రెండు గ్రూపుల మధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగింది. దీంతో హోటల్ నిర్వాహకులు వెంటనే కస్టమర్లపై దాడిచేశారు. నలుగురికి గాయాలయ్యాయి. మరో ఇద్దరు అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయినట్లు స్థానిక ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.