నాలుగు రోజులుగా జోరుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనజీవనం స్తంభిస్తోంది. వరుసగా నాలుగోరోజూ ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో జోరువానలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా... జలాశయాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు, ఎగువనుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం తెల్లవారుజామున నీటి మట్టం 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్న 12 గంటల సమయానికి నీటిమట్టం మరింత పెరిగింది. ప్రస్తుతం 45.1 అడుగుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. గోదావరికి వరద పెరగడం వల్ల స్నానఘట్టాలు, కల్యాణ కట్ట ప్రాంతాల్లో వరద నీరు చేరింది. భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్థితిని కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి పరిశీలించారు. వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. లోతట్టుప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారుల్ని ఆదేశించారు.
నిలిచిన రాకపోకలు
దుమ్ముగూడెం మండలంలోని లక్ష్మీనగరం వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరడం వల్ల భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం, వాజేడుకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం దిగువ ప్రాంతంలో ఉన్న వీఆర్ పురం, కూనవరం, చింతూరు, మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి రహదారిపై వరద నీరు చేరడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. గుండాల మండలం పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకుపోయింది. మండలంలోని వాగులన్నీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏడుమెలికల వాగు, ఎదర్రేగు వాగు, మల్లన్న వాగు, కిన్నెరసాని వాగులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మండలంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మొత్తం 20 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం నగరానికి ఆనుకుని ప్రవహిస్తున్న మున్నేరుకు వరద ఉద్ధృతి భారీగా పెరగడం వల్ల మహోగ్రంగా ప్రవహిస్తోంది. గ్రామీణం చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. మొత్తం 25 గేట్లకు గానూ 23 గేట్లను ఎత్తి లక్షా 25 వేల క్యూసెక్కుల వరద నీటిని గోదావరికి విడుదల చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని మండలాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోతోంది.
ఇవీ చూడండి: వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ ఆరా