కరోనా కట్టడితో పాటు రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చక్కటి సేవలందిస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధాన్యం రాశిపై సీఎం చిత్రపటం ఏర్పాటు చేసి పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండలంలో కొవిడ్ విధులు, ధాన్యం కొనుగోలుకు సహకరిస్తున్న వివిధ శాఖల సిబ్బందిని ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సత్కరించారు.
జిల్లాలో ఇప్పటివరకు 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశారని.. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు చక్కటి సహకారం అందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కర్షకులు అవస్థలు పడకుండా అధికార యంత్రాంగం చక్కటి చర్యలు తీసుకుందని అభినందించారు.
వీటితో పాటు మూగజీవాలకు పశుగ్రాసం అందించడంలో రాష్ట్రంలోనే సత్తుపల్లి రైతులు ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 200 ట్రక్టుల గ్రాసం గోశాలలకు పంపడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, అదనపు కలెక్టర్ మధన్‌మోహన్, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:- కరోనా భయాలు బేఖాతరు- మద్యం కోసం ఎగబడ్డ జనం