Boy Died with Symptoms of Rabies Khammam : రాష్ట్రంలో వీధి కుక్కలు భౌ.. భౌ.. అంటూ భయపెడుతున్నాయి. వీధిలో ఆడుకుంటున్న చిన్నపిల్లలను వెంటపడి మరీ కరుస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన మరువక ముందే అటువంటి ఘటనే తాజాగా ఖమ్మం జిల్లాలో చోటుచేసుకొంది. జిల్లాలోని రఘునాథపాలెం మండలం పుఠానీ తండాకు చెందిన ఓ ఐదేళ్ల బాలుడు రేబిస్ వ్యాధి లక్షణాలతో ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు.
స్థానికుల కథనం ప్రకారం.. పుఠానీ తండాకు చెందిన బానోతు రవీందర్, సంధ్య దంపతుల చిన్న కుమారుడు భరత్(5) రెండు నెలల క్రితం ఇంటి వద్ద ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. అదే సమయంలో బాలుడిపై సైకిల్ పడింది. గమనించిన తల్లిదండ్రులు బాలుడికి తగిలిన గాయాలు సైకిల్ మీద పడటంతో తగిలిన గాయాలనుకొని వాటికి సాధారణ చికిత్స చేయించారు. గాయాలు నయం కావడంతో ఘటనను మర్చిపోయి యథావిధిగా వారి పనుల్లో నిమగ్నమై పోయారు.
ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా బాలుడు అస్వస్థతకు గురికావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలుడు పరిస్థితిని గమనించిన అక్కడి వైద్యులు రేబిస్ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వెంటనే హైదరాబాద్ నిమ్స్‌కు తరలించాలని సూచించారు. దీంతో బాలుడ్ని హైదరాబాద్ తరలిస్తుండగా.. అర్ధరాత్రి సమయంలో మార్గమధ్యలో మృతి చెందాడు.
కంటికి రెప్పలా పెంచుకున్న తమ పిల్లాడ్ని వీధి కుక్కలు పొట్టన పెట్టుకున్నాయని ఆ బాలుడి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. చిన్నారి శరీరంపై ఉన్న గాయాలు సైకిల్ మీద పడటంతో అయ్యాయనుకున్నామని.. లేకుంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని తండా వాసులు కోరుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బాలుడి మరణంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కుక్కల దాడిలో బాలుడికి గాయాలు: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి శివ కుమార్ రెడ్డి (12)పై వీధి కుక్కలు దాడి చేశాయి. ముఖం, మెడ ,పెదవులపై తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలుడికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు పరిగి పట్టణంలో వీధి కుక్కలు రోడ్లపైకి వచ్చి వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మున్సిపల్ అధికారులు మాత్రం ఇదంతా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని పట్టణ వాసులు వాపోతున్నారు.
ఇవీ చదవండి: