అకాల వర్షంతో రైతుల ఆశలు నీటి పాలయ్యాయి. భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లోని పలు మండలాల్లో కురిసిన వర్షంతో మొక్కజొన్న, ధాన్యం తడిసిపోయాయి. బొప్పాయి, మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి.
ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో వరి ధాన్యం, మొక్కజొన్న నూర్పిడి దశలో ఉన్నాయి. ఈ సమయంలో మూడు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు కురిసిన వర్షంతో పలు మండలాల్లో ధాన్యం, మొక్కజొన్న ఉత్పత్తులు తడిసిపోయాయి. పంట చేతికి వచ్చి అమ్ముకుందామన్న సమయంలో గాలివానలు గుక్కతిప్పుకోనీయడం లేదు. ఒక్కసారిగా వర్షం కురవడం, పొల్లాల్లో ధాన్యం ఉండటంతో పట్టాల కింద ఉన్న ధాన్యం రాశుల్లోకి నేల కింద నుంచి వర్షం నీరు వచ్చిచేరుతోంది.
* కొణిజర్ల, వైరా మండలాల్లో కళ్లం మీద ఉన్న మొక్కజొన్న, ధాన్యం, మిరప కొంతవరకు తడిచాయి. మొక్కజొన్న, ధాన్యం కేంద్రాల్లో రైతులు పరదాలను కప్పారు.
* కొణిజర్ల, మల్లుపల్లి, బస్వాపురం, కొణిజర్లలోనూ మొక్కజొన్న వర్షానికి తడిసింది. కోతకు వచ్చిన మొక్కజొన్న, వరి పంట నేలవాలింది.
* ఏన్కూరులో ఈదురు గాలులతో బొప్పాయి నేలమట్టమైంది. హిమాంనగర్, రేపల్లెవాడలో చెట్లు విరిగిపడి కాయలు నేలపాలయ్యాయి. కల్లాలో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న, మిరప దిగుబడులు తడిచాయి. గ్రామాల్లో ఇళ్లు పాకిక్షంగా దెబ్బతిన్నాయి. కొత్తగూడెం- ఖమ్మం ప్రధాన రహదారిలో అడ్డంగా చెట్లు విరిగిపడ్డాయి.
* జూలూరుపాడు: పలు గ్రామాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. జూలూరుపాడులోని ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో కొన్ని ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. తహసీల్దార్ కె.విజయ్‌కుమార్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. సూరారంలో, జూలూరుపాడులో వృక్షాలు కొమ్మలు విరిగి పడ్డాయి. జూలూరుపాడు- పాపకొల్లు రహదారిలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పొలాల్లో గుడారాలు వేసుకున్న వలస కూలీలు గాలివాన బీభత్సానికి వణికిపోయారు.
* మధిర: కల్లాల్లో మిరప కాయలు, ధాన్యం ఉన్న రైతులు ఇబ్బంది పడ్డారు. ఈదురు గాలులతో వర్షం రావడంతో ఆందోళన చెందారు. సిరిపురం, దెందుకూరు గ్రామాల్లో చిరుజల్లులు పడ్డాయి.
* కల్లూరు, సత్తుపల్లి, తల్లాడ: కల్లూరు మండల పరిధిలోని చండ్రుపట్ల, లింగాల, ఎర్రబోయినపల్లి, పేరువంచ గ్రామాల్లో పెద్దఎత్తున మామిడి కాయలు నేలరాలాయి. కాటా వేసిన సుమారు 10వేల ధాన్యం బస్తాలు స్వల్పంగా తడిసిపోగా కల్లాల్లో ఆరబోసిన ధాన్యపు రాసుల కిందకు నీరు చేరాయి. ఈదురు గాలులతో మామిడి కాయలు నేలరాలాయి. తల్లాడ మండలంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కొంతమేర తడిసింది. రైతులు టార్పాలిన్లు కప్పారు. కాకర్లపల్లి, రుద్రాపల్లి, సత్తుపల్లిలో పలు ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం కురిసింది.
* చంద్రుగొండ: మండలంలో అరగంట పాటు భారీ వర్షం కురిసింది. దామరచర్ల, మద్దుకూరు వద్ద కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం స్వల్పంగా తడిసింది. రావికంపాడు, పోకలగూడెం, తుంగారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందిపడ్డారు. అక్కడక్కడా గ్రామాల్లో ఇళ్లపై రేకులు లేచాయి.