ఊరు బయట పాడుపడ్డ భవనం.. శిథిలమైన గోడల మధ్య జీవచ్ఛవంలా... ఎముకుల గూడుపై చర్మం కప్పబడి ఉన్నట్లుగా ఓ వ్యక్తి. చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతూ.. బతుకు పోరాటం చేస్తున్నాడు. పరిశీలించి చూస్తేగాని... బతికి ఉన్నాడని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడంటే.. అతని పరిస్థితి అర్థం చేసుకోవాలి. అనారోగ్యం పాలైన ఓ మనిషిని ఊరంతా గెంటేసినా ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసింది.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గుర్రాల పాడు వద్ద మిరప శీతల గిడ్డంగిలో హమాలీగా పనిచేసేవాడు. అతడి భార్య 15ఏళ్ల క్రితమే వదిలేసి వెళ్లిపోయింది. కొన్నాళ్ల క్రితం జ్వరం రావడం వల్ల ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా... హెచ్ఐవీ పాజిటివ్, టీబీ ఉన్నట్లు తేలింది. ఆస్పత్రిలో కొన్ని రోజులు తీసుకుని... వైద్యుల సూచనలతో సువర్ణపురంలోని తన తండ్రి ఇంటికి వచ్చాడు. అతని తండ్రికి ఇద్దరు భార్యలు. అతడికి సేవ చేసేందుకు తండ్రి ముందుకొచ్చినప్పటికీ మిగతా కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం వల్ల ఇంట్లోకి రానివ్వలేదు. హెచ్ఐవీ రోగికి దూరంగా ఉండాలని ఊరి చివర పాడుబడిన భవనంలో వదిలేశారు. కనీసం ఆహారం పెట్టేవారు లేక అనారోగ్యంతో చిక్కి శల్యమైపోయాడు.
ఆదుకున్న అన్నం సేవా ఫౌండేషన్
కుటుంబ సభ్యులు వెళ్లగొట్టిన అతని దీనస్థితిని చూసిన గ్రామస్థులు అన్నం సేవా ఫౌండేషన్ సభ్యులకు సమాచారం అందించారు. ఆ సంస్థ ఛైర్మన్ శ్రీనివాసరావు తన బృందంతో వచ్చి రోగికి సపర్యలు చేసి... మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇకనైనా..
హెచ్ఐవీ అంటువ్యాధి కాదని తెలిసినా ప్రజలు అమానవీయంగా ప్రవర్తించడం ఆధునిక సమాజంలో ఇంకా కనిపిస్తూనే ఉంది. ప్రజల్లో అవగాహన కల్పించి.. ప్రజల్లో అవగాహన కల్పించి.. మానవతా విలువలు కాపాడాల్సి ఉందని ఇలాంటి ఘటనలు గుర్తు చేస్తున్నాయి.
ఇదీ చూడండి: నిలువ నీడలేక ఓ కుటుంబం... చూస్తోంది ఓ చిన్న సాయం కోసం