తెరాసలో తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్ హాలులో పాత్రికేయులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై ఆయన స్పందించారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న తనకు టికెట్ ఇవ్వనందుకు ఎంత బాధపడ్డానో..రాజ్యసభ సీటు ఇవ్వకపోవడం తనను మరింత బాధించిందన్నారు.
అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని పొంగులేటి పేర్కొన్నారు. ఎంపీ టికెట్ రాని సమయంలో రెండు జాతీయ పార్టీలు సంప్రదించినప్పుడే పార్టీ మారలేదని... ఇప్పుడు మారాల్సిన అవసరం తనకేముందన్నారు. తాను నామినేటెడ్ పదవులు ఆశించడం లేదని పార్టీ అధిష్ఠానానికి చెప్పినట్లు వివరించారు.
తెరాస పని అయిపోలేదు...
వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఓటమి, హైదరాబాద్లో కొన్ని స్థానాలు కోల్పోవడం వల్ల తెరాస పని అయిపోయినట్లు కాదన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచే సత్తా తెరాసకు ఉందన్నారు. ఖమ్మం నగరపాలక ఎన్నికల్లో తన వర్గానికి టికెట్లు కేటాయించాలని కోరినట్లు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు.
దేశంలో జమిలి ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్న సమాచారం ఉందని పొంగులేటి తెలిపారు. వైఎస్ షర్మిల పార్టీ స్థాపనపై స్పందించిన ఆయన... తొలి అడుగుల్లో ఉన్న పార్టీపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. షర్మిల పార్టీ వెనుక కేసీఆర్ ఉన్నారన్న వార్తలు అవాస్తవమన్నారు.
ఇదీ చూడండి: సైబర్ నేరగాళ్ల మోసాల పరంపర... స్కాన్ చేస్తే నగదు మాయం