చిన్నారులకు పౌష్టికాహారమైన బాలామృతం పంపిణీలో ఖమ్మం జిల్లా అధికారులు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఆరు నెలల నుంచి మూడేళ్ల వయస్సున్న వారికి ప్రభుత్వం దీనిని సరఫరా చేస్తోంది. ఈ బలవర్ధక ఆహారాన్ని ఒక్కొక్కరికి మూడు నెలలకు సరిపడా రెండున్నర కిలోలను ప్యాకెట్ల రూపంలో అందిస్తోంది. ఇది వినియోగించే గడువుకు వారం రోజుల ముందు లబ్ధిదారుల చేతికి చేరుతోంది. మూడు నెలలపాటు వాడాల్సిన ఆహారం ఆలస్యంగా అంగన్‌వాడీ కేంద్రాలకు చేరడంతో ప్రయోజనం లేకుండా పోతుంది. పిల్లలకు పంపిణీ చేసిన ప్యాకెట్లపై గడువు తేదీ చూసుకున్న వారు జాగ్రత్త పడుతుండగా గమనించని తల్లిదండ్రులు చిన్నారులకు ఇదే ఇస్తున్నారు. తయారీ కేంద్రం నుంచి సరఫరా అయ్యే ప్యాకెట్లు కాల పరిమితి ముగిసిన తర్వాత అంగన్‌వాడీలకు సరఫరా చేస్తున్నారనే విమర్శలున్నాయి. అసలే కొవిడ్ నేపథ్యంలో ఆరునెలలుగా ఆహార పంపిణీ తీరు ప్రహసనంలా మారింది. అరకొరగా అందిస్తున్న ఈ ప్యాకెట్లు ఆలస్యంగా కేంద్రాలకు చేరుకోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.
ఇదీ ఆహారం..
బాలామృతం పేరుతో అందజేసే ఆహార పొడి ఎంతో బలవర్థకమైనదని నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. దీనిలో వేయించిన గోధుమ పిండి, శనగపప్పు పిండి, పంచదార, పాలపొడితో రూపొందిన మిశ్రమం ఉంటుంది. తద్వారా ఇనుము, విటమిన్ ఎ, బి, సి, ఫోలిక్ యాసిడ్, బి-12, జింక్ నియాసిన్‌లతో కూడిన విటమిన్ ఖనిజ లవణాలు లభిస్తాయి. ఈ ఆహారాన్ని జాతీయ పోషకాహార సంస్థ సాంకేతిక సహకారంతో తయారు చేసి కేంద్రాలకు సరఫరా చేస్తోంది. ప్యాకెట్ తయారీ తర్వాత మూడు నెలల కాల వ్యవధిలో ఉపయోగించాలి. ప్యాకెట్‌ను విప్పిన తర్వాత నెల రోజులలోపు వాడాలని దానిపై రాసి ఉంటుంది. ఈ ఏడాది ఏడో నెలలో తయారైన బాలామృతం ప్యాకెట్లు పదో నెలలో కాలపరిమితి ముగిసే గడువుకు పది రోజుల ముందు కేంద్రాలకు చేరాయి. ఈ సమయంలో వాటిని పంపిణీ చేయడానికి ముందే కొన్ని ప్రాంతాల్లో ఉపయోగం లేకండా పోతున్నాయి. గడువు తేదీని గమనించిన కొందరు ఇదేమిటని అంగన్‌వాడీ టీచర్లను ప్రశ్నిస్తుండగా తాము గమనించలేదని సమాధానం ఇస్తున్నారు. కేంద్రాలకు వచ్చిన ప్యాకెట్లనే తాము పంపిణీ చేస్తున్నామని తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో గడువు ముగిసిందని తెలిసిన లబ్ధిదారుల కుటుంబాలు బలవర్ధకమైన ఆహారాన్ని పారబోస్తున్నారు. ఈ ఆహారాన్ని పిల్లలకు తినిపించడం వల్ల ఎలాంటి అనర్ధాలు ఏర్పడతాయోనని భయాందోళన చెందుతున్నారు.
ఏడు ప్రాజెక్టుల పరిధిలో..
ఖమ్మం జిల్లాలో ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో మూడేళ్ల లోపు వయస్సు చిన్నారులు 40,516 మంది ఉన్నారు. నెలకు 1,82,372 ప్యాకెట్లు అందాల్సి ఉంది. గతనెల 94,729 ప్యాకెట్లు అందాయి. అంటే 50 శాతం మాత్రమే సరఫరా అయ్యాయి. అవి కూడా గడువుకు పది రోజుల ముందు వచ్చాయి. లాక్‌డౌన్‌లో మూడు నెలల పాటు బాలామృతం అసలు అందలేదు. ఇప్పుడిప్పుడే కేంద్రాలకు సరఫరా చేస్తున్నారనుకునే తరుణంలో గడువు దగ్గరగా ఉన్న ప్యాకెట్లు లబ్ధిదారుల చేతికి ఇస్తున్నారు. ఎంతో వ్యయంతో ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న బలవర్థక ఆహారం లబ్ధిదారులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు.
పౌష్టికాహారం విషయం ఇలా ఉంటే అంగన్‌వాడీల్లో చిన్నారులకు అల్పాహారంగా అందించే ప్యాకెట్లు కూడా సరిగా సరఫరా కావడం లేదు. నెలకు 21,300 కేజీలు అవసరం ఉండగా 3,930 కేజీలు మాత్రమే సరఫరా అయ్యాయని సిబ్బంది చెబుతున్నారు. ఆహార సరఫరాలో లోపాలను అధికారులు పట్టించుకోవాలని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం..
తెలంగాణ ఫుడ్స్‌లో బాలామృతం తయారు చేస్తారు. అక్కడి నుంచే సరఫరా అవుతోంది. కొవిడ్ కారణంగా కొంతకాలంగా సరఫరాలో ఇబ్బందులున్నాయి. ప్యాకెట్లపై ఉన్న గడువు ముగిసిన తర్వాత పిల్లలకు పంపిణీ చేయకూడదు. అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం. -- సీహెచ్. సంధ్యారాణి, డీడబ్ల్యూవో
ఇవీ చూడండి: నిధులకు కొదువలేదు... పనుల జాడలేదు