ప్రభుత్వం పేదలకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. తమ ఇళ్లను మరొకరికి కేటాయించారంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పండగరోజు రాత్రికి రాత్రే గృహ ప్రవేశాలు చేశారని ఆందోళనకారులు ఆరోపించారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలో జరిగింది.
ఈరోజు అధికారులు గ్రామసభ ఏర్పాటు చేసి అర్హులకు ఇళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మొదటి విడతలో వచ్చిన తమ పేర్లను తొలగించి మరొకరికి ఇచ్చారని మహిళలు ధర్నాకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. తమకు తెలియకుండా పేర్లను తొలగించారని మహిళలు వాపోయారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.