ఖమ్మం జిల్లా కొనిజర్ల పోలీస్ స్టేషన్లో డీజీపీ మహేందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. జిల్లాలో పర్యటించిన ఆయన... పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడారు. వారి విధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన డీజీపీ... స్టేషన్ పరిధిలోని కేసుల వివరాలపై ఆరా తీశారు.
పోలీసుల బాధ్యతలు, విధులపై సిబ్బందిని డీజీపీ ప్రశ్నించారు. ఫిర్యాదుదారుల పట్ల ఎలా ఉండాలనే అంశంపై అడిగారు. స్నేహభావంతో మెలగాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి పౌరుడిని గౌరవించాలని సూచించారు. పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, విధుల పట్ల అలసత్వం వహించకుండా అంకితభావంతో పని చేయాలన్నారు.
శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ సత్యనారాయణ, సీఐ వసంత్ కుమార్‌లను ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఐజీ నాగిరెడ్డి, సీపీ విష్ణు యస్ వారియర్, శిక్షణ ఐపీఎస్ స్నేహ మిశ్రా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తొలుత ఖమ్మంలో ఆయన పర్యటించారు. లాకప్‌డెత్‌కు గురైన మరియమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల ఆత్మహత్యకు యత్నించి.. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడిని కలిశారు. అతని ఆరోగ్యంపై వైద్యులను ఆరా తీశారు. మరియమ్మ కుటుంబ సభ్యులతో ఆమె మృతి గురించి మాట్లాడారు.
మరియమ్మ మృతిపట్ల డీజీపీ విచారం వ్యక్తం చేశారు. ప్రజల ఆత్మగౌరవం, ప్రాణాలకు భంగం కలగకుండా నడుచుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం సాయం ప్రకటించింది.
ఇదీ చదవండి: Traffic Divertion: భాగ్యనగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు