- ఖమ్మం మామిళ్లగూడెంకు చెందిన ఓ వ్యక్తి మొబైల్‌కి బ్రాండ్ స్ట్రీట్ పేరిట ఓ అప్లికేషన్‌కు సంబంధించిన సంక్షిప్త సందేశం వచ్చింది. ఆ మెసేజ్‌ను తెరిచి చదివాడు. అందులో సోషల్ మీడియాకు చెందిన వివిధ యాప్ ప్రమోషన్లు చేస్తే భారీగా ఆదాయం వస్తుందన్నది సారాంశం. కొద్దిపాటి పెట్టుబడి పెట్టి భారీగా ఆదాయం గడించవచ్చని ఆశ చూపడంతో సదరు వ్యక్తి రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత వాలెట్ అకౌంట్‌కు రూ.11 లక్షల ఆదాయం వచ్చినట్లు సమాచారం పంపారు. బ్యాంకులకు సెలవు ఉండటంతో తర్వాత తీసుకోవాలని ఈలోగా.. మరింత ఆదాయం కోసం పెట్టుబడి పెట్టాలని సూచించగా.. అత్యుత్సాహంతో మరో రూ.13 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు బాధితుడు. ఇలా ఏకంగా రూ.25 లక్షల పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత ఆదాయం లేదు. పెట్టిన పెట్టుబడి డబ్బుల జాడ లేదు. ఇదంతా నకిలీ అని గుర్తించిన బాధితుడు బిత్తరపోయి ఈ నెల 11న రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
- ఖమ్మం గ్రామీణం ఠాణా పరిధిలో నివాసం ఉండే ఓ మహిళ మొబైల్ ఫోన్‌కు ఈ నెల 11న ఓ సంక్షిప్త సందేశం వచ్చింది. తన బ్యాంకు ఖాతాకు పాన్ కార్డు జమ చేయాల్సి ఉంది. చేయకపోతే బ్యాంకు ఖాతా రద్దవుతుంది. ఇవాళ ఒక్కరోజే ఇందుకు అవకాశం ఉందనేది ఆ సంక్షిప్త సందేశంలోని సారాంశం. అప్డేట్ చేసేందుకు ఓ లింకును కూడా పంపారు. ఆ లింకు ఓపెన్ చేయగానే ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్ అడిగారు. ఆ మహిళ వెంటనే ఓటీపీ నంబర్ టైప్ చేసింది. అంతే.. ఆమె ఖాతాలోని దాదాపు రూ.37,000 మాయమైపోయాయి. ఇది చూసి అవాక్కయిన మహిళ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు ముమ్మర విచారణ సాగిస్తున్నారు.
సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే దిశగా పోలీస్ శాఖ చర్యలు
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎక్కడో ఓ చోట ఈ తరహా సైబర్ మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఏ మేరకు పెరిగిందో అంతే వేగంగా సైబర్ నేరాలు పెరుగుతూ వస్తున్నాయి. కొందరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న సైబర్ మోసగాళ్లు నిండా ముంచుతుంటే.. సులువుగా సంపాదించవచ్చనే ఆశతో విద్యావంతులు, సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వాళ్లూ ఈ తరహా మోసాలకు బలవుతున్నారు. మనషులు కనిపించకుండా, వారి గొంతు కూడా వినిపించకుండానే తీవ్రమైన ఆర్థిక నేరాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారు. బ్యాంకు ఖాతాల్లోని డబ్బు దోచుకోవడమే కాకుండా వ్యక్తిగత గోప్యత, భద్రతకూ భంగం కలిగిస్తున్నారు. ఇలా సైబర్ నేరాల పరంపంర అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. జిల్లాల్లో సైబర్ వారియర్ యూనిట్లను పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం, సైబర్ వలలో చిక్కుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అనేక కార్యక్రమాలు, అవగాహన సదస్సులు చేపడుతున్నారు. అయినప్పటికీ సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు. రోజుకో రీతిన కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
ఇటీవల ఖమ్మంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. అమాయక ప్రజలకు వల విసిరి బ్యాంకు ఖాతాలను కొల్ల గొడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. అడ్డు, అదుపూ లేకుండా చేలరేగిపోతున్న సైబర్ నేరగాళ్ల పట్ల అవగాహన కల్పించేందుకు ఖమ్మం పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఈ తరహా మోసాలను అరికట్టేందుకు సైబర్ దోస్త్ పేరిట ఖమ్మం కమిషనరేట్ పరిధిలో పోలీసులు శ్రీకారం చుట్టారు. పోలీస్ కమిషనర్ విష్ణు.ఎస్.వారియర్ ఆలోచనలతో పుట్టిన ఈ సైబర్ దోస్త్‌ను జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు.
అసలేమిటీ సైబర్ దోస్త్
సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడం ఎంత ముఖ్యమో..అదే తరహాలో నేరాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయడం కూడా అంతే ముఖ్యం. ఇదే ఉద్దేశంతో రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం కమిషనరేట్ పరిధిలో సైబర్ దోస్త్‌కు పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. సైబర్ నేరాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయడమే దీని ముఖ్య ఉద్దేశం. సైబర్ మోసాల నివారణ కోసం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ అసలు సైబర్ నేరాలకు తావు లేకుండా చేయాలన్నదే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది. సైబర్ నేరాలు సాగుతున్న తీరు, ఏ తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఏ తరహా మోసం వెలుగుచూసింది. బాధితులు ఎలా నష్టపోయారు. ఇలా రోజుకు ఎంతమంది నష్టపోతున్నారు. సైబర్ మోసగాళ్లు ప్రజలను ఎలా నమ్మిస్తున్నారు. ఏయే ఆశలు చూపుతున్నారు. ఎలా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు అన్న అంశాల పూర్తి వివరాలను ప్రజలకు అందించేలా సైబర్ దోస్త్‌కు రూపకల్పన చేశారు.
సైబర్ దోస్త్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తాం
ప్రజలకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించడం, ఈ తరహా మోసాల బారినపడకుండా పూర్తిగా అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ప్రణాళిక చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా సైబర్ దోస్త్ పేరిట 7901144702 నంబర్ ఏర్పాటు చేశారు. ఈ నంబర్ జిల్లాలో అన్ని వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో విస్త్రతంగా ప్రచారం కల్పించాలన్నది పోలీసు శాఖ లక్ష్యం. అన్ని గ్రూపుల్లో ఈ నంబర్ ఉండేలా చూస్తున్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్‌కు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరం వరకూ అన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఉండేలా చూస్తున్నారు. ఈ నెల 11న లాంఛనంగా ఈ ప్రక్రియ ప్రారంభించారు. కాలనీ, కమ్యూనిటీ గ్రూపులు మొదలుకొని ప్రతీ వాట్సాప్ గ్రూపులో ఈ నంబర్‌ను అందుబాటులో ఉంచేలా చూస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, విద్యావంతులు, వ్యాపారవర్గాలు ఇలా అన్నిరంగాల వారికి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తొలిరోజే దాదాపు 300 గ్రూపుల్లో చేర్చారు. మొత్తం వెయ్యి గ్రూపుల్లో చేర్చాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు.
లక్షమందికి చేరేలా కార్యచరణ
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో లక్షలాది మందికి ఈ సైబర్ దోస్త్ నంబర్ వెళ్లేలా కార్యాచరణ చేపట్టారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ నంబర్ చేర్చి సైబర్ నేరాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలన్నదే పోలీసు శాఖ లక్ష్యం. జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో సాగుతున్న సైబర్ మోసాల వివరాలను ఈ నంబర్ ద్వారా రోజూ సమాచారం అందజేస్తారు. ఓటీపీలు, ఆధార్, పాన్ అనుసంధానం, సిమ్ యాక్టివేషన్, ఓఎల్ఎక్స్ అమ్మకాలు, ఇతర సంస్థల నుంచి భారీ ఆపర్లు, రుణాలు, తదితర మోసాల పేరుతో సాగుతున్న సైబర్ నేరాలను ఇందులో వివరిస్తున్నారు. సైబర్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలు వివరిస్తున్నారు. జిల్లాలో ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
"సైబర్ నేరాలు రోజురోజూ పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త తరహా మోసం బయటపడుతుంది. ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రజల్లో పూర్తిగా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాలపై పూర్తిగా అవగాహన కల్పించడంతోపాటు అప్రమత్తం చేసేందుకు ఈ సైబర్ దోస్త్‌ను ప్రారంభించాం. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాం. విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. సైబర్ మోసాలపై విస్తృతమైన చర్చ సాగేలా కార్యాచరణ ఉంటుంది. ఫలితంగా సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండేలా చేయాలన్నదే మా లక్ష్యం. ఇందుకు ప్రజలంతా సహకరించాలని కోరుతున్నా."
- సీపీ విష్ణు.ఎస్.వారియర్
ఇదీ చూడండి: Cyber Crimes in telangana : మీకు ఎస్‌బీఐలో ఖాతా ఉందా..? అయితే.. అప్రమత్తం కావాల్సిందే!