కొవిడ్ మొబైల్ టెస్టింగ్ బస్సులు మారుమూల ప్రాంతాల్లో తిరుగుతూ కరోనా నిర్ధరణ పరీక్షలు చేస్తాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో 3 కొవిడ్ మొబైల్ టెస్టింగ్ బస్సులను కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి ప్రారంభించారు. రెండు బస్సులు ఖమ్మం జిల్లాలో, ఒకటి భద్రాద్రి జిల్లాలో తిరుగుతూ మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లలాగా పని చేస్తాయని వెల్లడించారు.
కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం 5 నెలలుగా నిర్విరామ కృషి చేస్తుంటే ప్రజలకు ఏమీ చేయలేని ప్రతిపక్షాలు వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. లాక్డౌన్ సమయంలో నిత్యావసరాలు, రూ.1500 ఆర్థిక సాయం ఇచ్చి ప్రజలను ఆదుకుంటే.. ప్రతిపక్షాలు కనీసం స్పందించలేదని మండిపడ్డారు.
ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరిచామన్న అజయ్.. కరోనా కట్టడి అయ్యే వరకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమర్థంగా పనిచేస్తారని స్పష్టం చేశారు.