ఖమ్మం నగరంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. అందుకే ప్రతిరోజూ నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యలే నిదర్శనం. మొదట్లో అడపా దడపా ఒకటీ రెండు మాత్రమే కేసులు నమోదవగా పరిస్థితి అదుపులోనే ఉందనుకున్న అధికార యంత్రాంగానికి... ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కేసులు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. జిల్లాలో నమోదయ్యే కేసుల్లో దాదాపు 90 శాతం కేసులన్నీ నగరంలోనే నమోదవుతుండటం గమనార్హం. తొలుత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో వైరస్ జిల్లాకు చేరుకుంది. ఆ తర్వాత ఒకరి నుంచి ఒకరికి విస్తరిస్తూ తీవ్ర ప్రభావం చూపింది. జిల్లాలో మొత్తం 490 పాజిటివ్ కేసులు నమోదైతే వీటిలో 450 పైగా కేసులు ఖమ్మం నగరంలో వెలుగులోకి వచ్చాయి.
ఓ వైపు కేసులు పెరుగుతున్నా రహదారులపై ఇష్టారాజ్యంగా జనం సంచారం కొనసాగుతుండటం వల్ల వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. కరోనా బారి నుంచి తాము బయటపడాలంటే స్వచ్చంధ లాక్‌డౌనే సరైన నిర్ణయమని భావించి పూర్తిగా దుకాణాలను మూసివేశారు. వస్త్ర దుకాణాలు, బులియన్ మర్చంట్స్, మెకానిక్‌లు, రిజిస్ట్రార్ కార్యాలయం, డాక్యుమెంటు రైటర్లు, కిరాణా జాగిరీ మర్చంట్స్ తదితర వ్యాపార వర్గాలు స్వచ్ఛంధంగా పనివేళల్లో మార్పులు చేసుకున్నారు. వ్యవసాయ మార్కెట్‌ను కూడా మూసేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
బులిటెన్ గందరగోళంతో మరింత ఆందోళన
జిల్లావ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏ ప్రాంతంలో నమోదయ్యాయి. అన్న పూర్తి వివరాలతో బులిటెన్ విడుదల చేస్తే... ఆ ప్రాంతంలోని మిగతావారు అప్రమత్తమవుతారు. కరోనా సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఫలానా ప్రాంతంలో పాజిటివ్ కేసు నమోదైంది. జాగ్రత్తగా ఉండాలని చెప్పేవారే కరయ్యారు. గతంలో పాజిటిట్ కేసు నమోదైన ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పచికారీ చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.
స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష
కరోనా బారి నుంచి తమను తాము రక్షించుకోవాలంటే... స్వీయ నియంత్రణ తప్పనిసరని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి లక్షణాలు లేనివారిలోనూ వైరస్ వ్యాప్తి ఉంటున్నందున మరింత జాగ్రత్తగా ఉండాల్సిన తరుణమిదేనని హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప రహదారులపైకి రావొద్దని సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు.. ఏడుగురు మృతి