మూడు గంటలు నిరీక్షించినా కనీసం పట్టించుకోలేదని.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే కరోనా రోగి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తూ ఖమ్మం ఆస్పత్రి ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. కామేపల్లి మండలం ఊట్కూరుకు చెందిన ద్రాక్షపల్లి శంకర్(48)కు వారం రోజుల క్రితం కరోనా సోకింది. అప్పటినుంచి హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యులు సూచించిన మందులు వాడుతూ చికిత్స తీసుకుంటున్నాడు.
ఈరోజు తెల్లవారుజామున శంకర్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఇల్లందులోని బంధువుల సహాయంతో ఐసోలేషన్ కేంద్రానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అతని పరిస్థితి తెలుసుకున్న వైద్య సిబ్బంది ఇల్లందులో చేర్చుకోవడం కుదరదని చెప్పడంతో ఖమ్మం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యశాలలో పడకలు ఖాళీగా లేవని చెప్పడంతో బాధితుడు శంకర్‌ను మూడు గంటల పాటు ఆస్పత్రి బయటే ఉంచారు. వైద్యులు చికిత్స అందించకపోవడంతోనే శంకర్ చనిపోయాడంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇదీ చదవండి: కరోనా కాటుకు తండ్రీకొడుకు మృతి.. విషాదంలో కుటుంబం