కరోనా బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేసి విధులు నిర్వహిస్తున్న వైద్య, రెవెన్యూ, పోలీస్ ఉద్యోగులలో అభద్రతా భావం రోజురోజుకి పెరిగిపోతుంది. ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజక వర్గ పరిధిలోని ఇల్లందు, టేకులపల్లి, కామేపల్లి మండలాల్లో రెవెన్యూ, పోలీస్, సింగరేణి ఉద్యోగులను, వైద్య సిబ్బందిని కరోనా వెంటాడుతోంది.
టేకులపల్లి మండలంలో పోలీస్, రాజకీయ నాయకులకు కరోనా నిర్ధరణ కాగా... కామేపల్లి మండలంలో ఏకంగా ఆరుగురు పోలీసులకు కరోనా నిర్ధరణ జరిగింది. ఇప్పటికే పోలీస్ స్టేషన్ ప్రాంతాన్ని కంటెంట్మెంట్ జోన్ గా ప్రకటించారు.
సింగరేణి ఉద్యోగులపై..
లాక్ డౌన్ వంటి కీలక సమయంలో విధులు నిర్వహించిన సింగరేణి ఉద్యోగులను సైతం కరోనా వెంటాడుతోంది. సింగరేణి ఇల్లందు కార్యాలయంలో, కోయగూడెంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులలో వైరస్ నిర్ధరణ కేసులు పెరుగుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తోడు కరోనా కేసుల ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. వర్షాల కారణంగా ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటం వల్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.