Congress Unemployment Protest Rally in Khammam Today: విద్యార్ధి, నిరుద్యోగ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ... నేటి నుంచి వరుసగా నిరుద్యోగ నిరసన ర్యాలీలు కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి ప్రభావం దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులపై పడిందని... కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ... వచ్చే నెల నాలుగైదు తేదీలల్లో హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఇందుకు సన్నాహక సమావేశాలు నిర్వహించడంలో భాగంగా... రోజుకొక విశ్వవిద్యాలయాన్నిసందర్శించి అక్కడ నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వ వైఖరిని ఎండగడతారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై మరింత ఒత్తిడి పెంచి సిట్టింగ్ జడ్జికి కానీ, సీబీఐకి కానీ దర్యాప్తు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇదే అంశంపై ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి విభాగం హైకోర్టును ఆశ్రయించింది. నిరుద్యోగ నిరసన సభలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజా వ్యతిరేక ఓటును తమవైపు తిప్పుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
ఇందులో భాగంగా నేడు ఖమ్మంలో, ఈ నెల 26న ఆదిలాబాద్... ఈ నెల 28న నల్గొండ, 30న తేదీన మహబూబ్‌నగర్... వచ్చే నెల ఒకటో తేదీన రంగారెడ్డి జిల్లాల్లో సన్నాహక ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అందరి ఆమోదయోగ్యంతో ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మే 4 లేదా 5 తేదీల్లో సరూర్నగర్ మైదానంలో నిర్వహించే భారీ సభకు ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తుండడంతో.. అందుకు తగిన ఏర్పాట్లపై పీసీసీ ప్రత్యేక దృష్టి సారించింది.
నేడు ఖమ్మంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ: ఈ విధంగా నిరుద్యోగుల సమస్యలపై తెలంగాణలో సమరభేరి మోగించడం ద్వారా యువతను కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు పీసీసీ ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువ ఓటర్లపై దృష్టి సారిస్తూ తమవైపు ఆకర్షితులను చేసుకునే దిశలో కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకు వేస్తోంది. ఇవాళ ఖమ్మం నగరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి.. సాయంత్రం 4 గంటల వరకు భారీ ప్రదర్శన.. మయూరి సెంటర్, పాత బస్టాండ్ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు... ఇతర సీనియర్ నాయకులు పాల్గొంటున్నారు.
ఇవీ చదవండి: