Congress MLA Tickets in Khammam : శాసనసభ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్ మథనం కొనసాగుతోంది. నియోజకవర్గాల వారీగా సీట్ల కేటాయింపుపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు దాదాపు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా పార్టీలో విధేయత, సర్వేలో వచ్చిన నివేదికలు, సామాజికవర్గాల సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల జాబితా సిద్ధం చేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో 10 స్థానాలుండగా.. మధిర, భద్రాచలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పొదెం వీరయ్యను.. మరోసారి బరిలోకి దించే అవకాశం ఉంది. ఆ మేరకు వారి పేర్లు.. కేంద్ర ఎన్నికల కమిటీకి చేరాయి.
Khammam Congress MLA Tickets War : పాలేరు, ఖమ్మంలో అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. చెరోచోట నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న అంశంపై ఇంకా స్పష్టతరాలేదు. మిగిలిన 6 చోట్ల ఆశావహుల్లో పోటాపోటీ నెలకొంది.
Congress MLA Candidates List 2023 : ఒక్కో నియోజకవర్గం నుంచి.. ఐదుగురికి తగ్గకుండా దరఖాస్తులు చేసుకున్నా స్క్రీనింగ్ కమిటీ వడపోత తర్వాత ఒక్కోచోట నుంచి ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. ఆశావహులు ఇప్పటికే పీసీసీ, ఏఐసీసీ ముఖ్యనేతలను కలిసి అభ్యర్థిత్వాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు భట్టివిక్రమార్క, పొంగులేటి, రేణుకాచౌదరి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వేల ఆధారంగా కేటాయింపు ఉంటుందన్న ప్రచారం ఉన్నా.. ముగ్గురు నేతలకు ఏఐసీసీ స్థాయిలో పలుకుబడి ఉండటంతో అనుచరుల టికెట్ల కోసం ముఖ్యనేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. త్వరలో జరిగే స్క్రీనింగ్ కమిటీ భేటీ తర్వాత అభ్యర్థుల ఎంపిక కొంతమేర కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రెండు స్థానాలకు బీసీలకు కేటాయించాలన్న.. డిమాండ్ ఉండటంతో సామాజిక సమీకరణాల లెక్కలు తెరపైకి వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో మూడు జనరల్, 5 ఎస్టీ, 2 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలుండటంతో.. సామాజిక వర్గాల వారీగా ఆశావహులు టికెట్లు ఆశిస్తున్నారు. మూడు జనరల్ స్థానాల్లో కొత్తగూడెంను బీసీలకు కేటాయించాలన్న డిమాండ్‌ఉంది. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలైన.. మధిర నుంచి భట్టివిక్రమార్క బరిలోకి దిగనుండగా సత్తుపల్లిని ఎస్సీలకు ఇవ్వాలని ఏఐసీసీని కోరగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
Telangana Congress MLA Candidates 2023 : పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు ప్రచారంలోకి వస్తుండటం, కొత్త నేతలరాకతో భంగపాటు తప్పదంటూ ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. పార్టీ కోసం ఏళ్లుగా విధేయతతో పనిచేసిన వారికి తీరని నష్టం వాటిల్లుతోందని జిల్లాకు చెందిన కొందరు నాయకులు పీసీసీ ముఖ్య నేతలను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికే టికెట్లు కేటాయిస్తే ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్న తమ సంగతి ఏంటని ప్రశ్నించినట్లు తెలిసింది. పార్టీ కోసం పనిచేసిన ఎవరికి టికెట్ ఇచ్చినా అభ్యంతరం లేదని కొత్తగా చేరినవారికి టికెట్లు కేటాయిస్తే సహకరించబోమని వారు తేల్చిచెప్పినట్లు ప్రచారం సాగుతోంది.