నగరపాలక సంస్థ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ నాయకత్వం... శ్రేణుల్ని సన్నద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మంలో ఆ పార్టీ రాష్ట్ర నేతలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్, కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు, 33 జిల్లాలు, పట్టణ, నగరాల అధ్యక్షులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
రేపోమాపో ప్రకటన...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని వారం రోజుల్లోగా అన్ని జిల్లాల్లో ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థుల జాబితాను అధిష్ఠానానికి పంపామని... రేపో మాపో ప్రకటన వస్తుందన్నారు. జిల్లాల్లో నేతల మధ్య చిన్న చిన్న విబేధాలు ఉన్నప్పటికీ అంతా కలిసికట్టుగా ముందుకు పోవాలని తీర్మానించారు.
దిల్లీలో దోస్తీ-గల్లీలో కుస్తీ...
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై బూత్ కమిటీలు, డివిజన్ కమిటీలతో ముఖ్య నేతలు సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. తెరాస-భాజపా దిల్లీలో దోస్తీ- గల్లీల్లో కుస్తీ చేస్తున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ ఆరోపించారు. కేసీఆర్... రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని చెబుతున్న భాజపా నేతలు... ఎందుకు చర్యలు చేపట్టం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్... అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలను తిరిగి చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు.
తెరాస-భాజపాలది దిల్లీలో దోస్తీ- గల్లీలో కుస్తీ. ఈ ఆరేళ్లలో సంపాదించిన డబ్బుపై సీబీఐ, ఈడీ, ఐటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారు. అందుకే కేసీఆర్ దిల్లీకి వెళ్లినప్పుడు నరేంద్ర మోదీ, అమిత్‌షాకు వంగి వంగి దండం పెడుతున్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక... కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతిపై విచారణ జరుపుతాం.
-- మాణికం ఠాగూర్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్
రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే...
బడ్టెట్‌లో రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసినా... తెరాస సర్కార్ ఎందుకు ప్రశ్నించటం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 15వ ఆర్థిక సంఘం నివేదిక తేటతెల్లం చేసిందన్నారు. 2023లో రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన పలు తీర్మానాలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. నెలరోజుల్లో అన్ని జిల్లాల్లో బూత్ స్థాయి కమిటీలు పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఇదీ చూడండి: పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు సహజం: ఉత్తమ్