CM KCR Speech in BRS Public Meeting at Illandu : 'తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్. బీఆర్ఎస్ బాసులు దిల్లీలో లేరు.. తెలంగాణలోనే ఉన్నారు. కొన్ని పార్టీలకు బాసులు దిల్లీలో ఉంటారు. దిల్లీలోని బాసులు స్విచ్ నొక్కినట్లుగా ఇక్కడి నేతలు ఆడుతారు. రైతుబంధు(Rythu Bandhu Scheme in Telangana) దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కరెంటు మూడు గంటలు చాలని మరో కాంగ్రెస్ నేత అన్నారు. రైతుబంధు ఉండాలో.. వద్దో ప్రజలే ఆలోచించుకోవాలి' అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(BRS Praja Ashirvada Sabha)లో ఆయన పాల్గొన్నారు.
బీఆర్ఎస్ రాక ముందు.. రైతుబంధు అనే పదం వినబడిందా అంటూ ఇల్లెందు ఓటర్లను సీఎం కేసీఆర్ అడిగారు. ఒకప్పుడు వ్యవసాయం చేసేవారికి ఎవరూ పిల్లనిచ్చేవారు కాదని.. ఇప్పుడు అమ్మాయిని ఇచ్చే ముందు భూమి ఉందా అని అడుగుతున్నారని అన్నారు. పదేళ్లలో తాము చేపట్టిన చర్యల వల్లే వ్యవసాయానికి విలువ పెరిగిందని హర్షించారు. లక్షల మంది రైతులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చామని చెప్పారు. పోడు రైతులపై ఉన్న కేసులు ఎత్తివేయించామని తెలిపారు. పట్టాలు ఇచ్చి పోడు రైతులకు కూడా రైతుబంధు అందించామన్నారు. అందుకే ఏ ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరిగిందో గమనించాలని కోరారు.
BRS Public Meeting at Illandu in khammam : ఎవరూ అడగకుండా దళితబంధు పథకం తెచ్చామని.. మేనిఫెస్టోలో లేకుండానే రైతుబంధు, మిషన్ భగీరథ(Mission Bhagiratha in Telangana) అమలు చేశామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో కరెంటు పరిస్థితి.. ఇప్పటి పరిస్థితిని గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుందన్నారు. ఇప్పటికే అనేకం ఆ రంగంలోకి చేర్చారని మండిపడ్డారు. అలాగే విద్యుత్‌ను కూడా మోదీ ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని హెచ్చరించారు. ఆనాడు తన ప్రాణం పోయినా.. మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని తేల్చి చెప్పానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
"నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ఆయనకు ఒక అహంకారం ఉంది.. అదే ప్రైవేటీకరణ. ఎల్ఐసీని అమ్ముతా ఉన్నాడు. అదే పిచ్చిలో కరెంటు రంగాన్ని ప్రైవేటీకరణ చేశారు. కానీ తెలంగాణలో ప్రభుత్వ రంగంలో పెట్టారు. రాష్ట్రంలో ఏ పవర్ ప్లాంట్ కట్టిన ప్రభుత్వ రంగంలోనే జరుగుతోంది. దీనిపై కోపం తెచ్చుకున్న మోదీ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నారు. నా ప్రాణం ఉన్నంత వరకు మీటర్ల పెట్టనని చెప్పాను. దాంతో ప్రతి ఏడాది విద్యుత్‌కు రావాల్సిన రూ.5000 కోట్లను ఆపేశారు." - కేసీఆర్, బీఆర్ఎస్ అధ్యక్షుడు
CM KCR Public Meeting in Telangana : ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రజలు మాత్రం వివేకంతో ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. దేశంలో రాజకీయ పరిణతి ఇంకా రావాల్సి ఉందన్నారు. పార్టీ చరిత్ర, దృక్పథం నిశితంగా గమనించి ఓటేయాలని సూచించారు. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీల పాలనను చూశారని వివరించారు. ఇప్పటివరకు పాలించిన పార్టీల్లో పాలన ఎవరు బాగా చేశారో గమనించాలన్నారు. సరైన వ్యక్తిని ఎన్నుకోకపోతే ఓడిపోయేది ప్రజలనేనని హితవు పలికారు. అన్నమో రామచంద్ర అని ఏడ్చిన తెలంగాణలో.. నేడు 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతోందని ఆనందించారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. 93 లక్షల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని మాటనిచ్చారు.