ఖమ్మంలో ఈనెల 18న భారాస ఆవిర్భావ బహిరంగ సభను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా నేతలకు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సభ ఏర్పాట్లపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో కేసీఆర్ ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా చర్చించారు. సభకు సుమారు 5 లక్షల మందిని సమీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లోని 20 నియోజకవర్గాలతో పాటు.. పొరుగు రాష్ట్రాల నుంచి సమీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కో నియోజకవర్గం నుంచి సుమారు 30 వేల నుంచి 40 వేల వరకు జనాన్ని సమీకరించేలా ప్రణాళిక చేశారు. సభ నిర్వహణ బాధ్యతలను జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డికి అప్పగించారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల నేతలు సమావేశానికి హాజరుకానున్నారు.
వ్యక్తిగత విభేదాలు వీడి కలిసి పనిచేయండి: ఖమ్మంలో 18న నిర్వహించే సభకు విస్తృత ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జిల్లా నేతలందరూ వ్యక్తిగత విభేదాలు వీడి కలిసి పనిచేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ ఖమ్మం పర్యటన ఆసక్తి రేపుతోంది. 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఈ సమావేశానికి మంత్రులు పువ్వాడ అజయ్, హరీశ్ రావు, ప్రశాంత్‌రెడ్డితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు నామా నాగేశ్వరరావు, రవిచంద్ర, సండ్ర వెంకటవీరయ్య, హరిప్రియ, రాములునాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: