గుండె జబ్బులకు చికిత్స అందించే అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం త్వరలో ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో తొలిసారిగా అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకూ ప్రభుత్వ వైద్యంలో నిమ్స్‌ను మినహాయిస్తే.. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో మాత్రమే క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉంది. గాంధీని కొవిడ్ ఆస్పత్రిగా ప్రకటించడం.. ఉస్మానియాలో క్యాథ్‌ల్యాబ్ పనిచేయకపోవడంతో ప్రజలు పడుతున్న అవస్థలపై ఇటీవల 'గుండె జారిపోతోంది...పేదోళ్లకు గుండెజబ్బు వస్తే దిక్కేది?' శీర్షికన ఈనాడు-ఈటీవీ భారత్‌లో కథనం ప్రచురితమైంది. దీనిపై వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ స్పందించి యుద్ధప్రాతిపదికన టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అధికారులు ఆ ప్రక్రియను ముగించారు. టెండర్లలో నిబంధనల మేరకు నిలిచిన సంస్థకు ఉస్మానియా ఆస్పత్రిలో తక్షణమే క్యాథ్‌ల్యాబ్ నెలకొల్పే బాధ్యతలను అప్పగిస్తూ కొనుగోలు ఉత్తర్వులు(పర్చేజ్ ఆర్డర్లు) జారీ చేశారు. ఉస్మానియాతో పాటు ఖమ్మం జిల్లా ఆస్పత్రిలోనూ అధునాతన క్యాథ్‌ల్యాబ్ నెలకొల్పడానికి కొనుగోలు ఉత్తర్వులిచ్చారు. ఒక్కోదానికి సుమారు రూ.7 కోట్లు వ్యయమవుతుంది. 60 రోజుల్లోగా ఈ రెండింటిలోనూ నెలకొల్పాలని ఆదేశించారు.
రోగులకు మేలు
- ఉస్మానియా ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగం కింద రోజుకు 10-15 వరకూ యాంజియోగ్రాములు, 7-10 వరకూ యాంజియోప్లాస్టీలు జరుగుతుంటాయి. కొత్త క్యాథ్‌ల్యాబ్ ఉస్మానియాకు రావడం వల్ల వివిధ ప్రభుత్వాస్పత్రుల రోగులందరికీ మేలు జరుగుతుంది.
- ఖమ్మంలో జాతీయ ఆరోగ్య మిషన్ పథకం నిధుల కింద క్యాథ్‌ల్యాబ్‌ను నెలకొల్పుతున్నారు. దీనివల్ల ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.
బహుళ ప్రయోజనాలు
- కొత్తగా నెలకొల్పనున్న క్యాథ్‌ల్యాబ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినవి. ఇందులో ‘త్రీడి ఇమేజ్’ వెసులుబాటు ఉంటుంది.
- ‘ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వు’ విధానం ఉంటుంది. గుండె రక్తనాళాల్లో 50-60 శాతం పూడికలు ఏర్పడితే దీనికి స్టెంట్ వేసే విషయమై ‘ప్రెజర్ వైర్’ను ఉపయోగిస్తారు. పూడికల వద్ద రక్త ప్రసరణ ఒత్తిడిని గుర్తించి స్టెంట్ వేయాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారు.
- గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినప్పుడు వాటిని గుర్తించడం, తొలగించడం ప్రధానాంశం. వీటితో పాటు గుండె కవాటాల మార్పిడి, కవాటాల మరమ్మతులు, పేస్‌మేకర్ అమర్చడం, గుండె చుట్టూ నీరు చేరడం(పెరికార్డియల్ ఎఫ్యూజన్) వంటి వాటికి చికిత్సలు క్యాథ్‌ల్యాబ్‌లోనే చేస్తుంటారు.
- గుండె రక్తనాళాల్లోనే కాదు.. చేతులు, కాళ్లలో రక్తనాళాలు, క్లోమగ్రంధిలో స్టెంట్లు వేసేందుకు క్యాథ్‌ల్యాబ్‌ను ఉపయోగిస్తారు.
- అత్యవసర పరిస్థితుల్లో ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో రక్తస్రావం అవుతుంటే దాన్ని నివారించడానికి క్యాథ్‌ల్యాబ్‌ను వినియోగిస్తారు.
- పుట్టుకతో వచ్చే గుండె జబ్బులను సరిచేస్తారు.
- ఉస్మానియా క్యాథ్‌ల్యాబ్‌లో ‘ఎలక్ట్రో ఫిజియాలజీ పరికరం.. కరోనరీ ఇంట్రా వ్యాస్కులర్ అల్ట్రాసౌండ్.. ఆప్టికర్ కొహెరెన్స్ టోమోగ్రఫీ’ వంటి మరికొన్ని అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెస్తున్నారు.
ఇదీ చదవండి: AstraZeneca: డోసులు ఆలస్యమైనా సమర్థంగానే?