ఖమ్మంలోని పెవిలియన్ మైదానంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో ఖమ్మం బుక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈనెల 2 ప్రారంభమైన ఈ పుస్తక ప్రదర్శనకు పాఠకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ కార్యక్రమం ఈ నెల 9 వరకు అందుబాటులో ఉండనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నుంచి అన్ని జిల్లాల్లో ప్రదర్శనలు నిర్వహించాలన్న ఆలోచనతో హైదరాబాద్ బుక్ ఫెయిర్ వారు ఖమ్మంలో ప్రదర్శన ప్రారంభించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇంది రెండో ప్రదర్శన.
ఈ ప్రదర్శనలో అన్ని రకాల ప్రజలకు కావాల్సిన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. సాహిత్యం, సాంస్కృతికం, చరిత్ర, సాంకేతిక అంశాలు, కంప్యూటర్ విద్య, విద్యార్థులకు అవసరమైన సమాచారంతోపాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న పుస్తకాలు కూడా అందుబాటులో ఉంచారు. ఇవి కాకుండా ప్రముఖ రచయితలకు సంబంధించిన పుస్తకాలు, తెలంగాణ ఉద్యమం, సంస్కతికి, విదేశీ రచయితల పుస్తకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రదర్శనలో పాఠకుల కోసం ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కవులు, రచయితలు... పాఠకులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. రోజు డ్రా తీసి పుస్తక ప్రియులకు ఉచితంగా ఐదు పుస్తకాలను అందచేస్తున్నారు.
పుస్తకాలు చదివే ఆసక్తి ఉన్నప్పటికి... తమకు కావాల్సిన పుస్తకాలు అందుబాటులో లేకపోవడం వల్ల పఠనం మీద దృష్టి సారించలేకపోతున్నట్లు పాఠకులు చెబుతున్నారు. ఇలాంటి ప్రదర్శనలు విరివిగా ఏర్పాటు చేస్తే కావాల్సిన పుస్తకాలు కనుక్కొని విజ్ఞానాన్ని సంపాదించుకుంటామని యువత అంటోంది. ప్రతి సంవత్సరం ఇలాగే ప్రదర్శన నిర్వహించాలని పుస్తక ప్రియులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: సోలాపూర్‌లో పూర్తిగా దగ్ధమైన హైదరాబాద్ ఆర్టీసీ బస్సు