రాష్ట్రంలో జరగనున్న పుర ఎన్నికల్లో భాజపా, జనసేన కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఖమ్మం నగరపాలిక ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలతో రెండు పార్టీల నాయకులు చర్చలు జరిపారు. ఖమ్మం నగరపాలికలో పోటీ చేసే అంశంపై నేతల మధ్య స్పష్టత వచ్చినట్టు తెలిపారు.
ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది మరోసారి జరిగే చర్చల్లో నిర్ణయించనున్నారు. ఈ చర్చల్లో జనసేన తరఫున రాష్ట్ర ఇంఛార్జ్ శంకర్‌గౌడ్, రామ్ తాళ్లూరి, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి వి.వి.రామారావు పాల్గొన్నారు. భాజపా తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.