Bhatti Vikramarka Tour In Khammam: రాష్ట్ర వనరులను పూర్తిగా రాష్ట్రానికే వినియోగిస్తాం. సంపద సృష్టిస్తాం ప్రజలకు పంచుతామని, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం(Oath Taking) చేసిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఖమ్మ జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా సరిహద్దు నాయకునిగూడెం వద్ద ప్రజలు మంత్రులకు ఘన స్వాగతం పలికారు.
Grand Welcome to Congress Ministers at Khammam : మహిళలు హారతి ఇచ్చి భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం మంత్రులు ర్యాలీగా ఖమ్మంకు చేరుకున్నారు. సాయంత్రం భద్రాద్రి రామయ్యను మంత్రులు దర్శించుకోనున్నారు. పాలేరు నుంచి కుసుమంచి వచ్చిన వారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని(Rajiv Arogyasree Scheme) అక్కడ పీహెచ్‌సీలో ప్రారంభించారు. అనంతరం భారీ కాన్వాయ్‌తో ఖమ్మం చేరుకున్నారు. ఖమ్మంలో అమరుల స్థూపానికి నివాళులు అర్పించిన వారు, ఖమ్మం పాత బస్టాండ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం మహాలక్ష్మీని ప్రారంభించారు.
ఆకుపచ్చజెండా ఊపి బస్సులను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ప్రకటించిన 6 పథకాల్లో రెండు పథకాలు ప్రారంభించామని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర వనరులను సమకూర్చుకుని 6 గ్యారెంటీలతో పాటు, మ్యానిఫెస్టోను అమలు చేసి చూపుతామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు వారంటీ లేదన్న పెద్దలకు ప్రజలు ఓటుతో చెంపచెల్లుమనిపించారని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీల్లో 2 గ్యారంటీలను ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లోనే ప్రారంభించామని తెలిపారు.
ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కట్టుబడి ఉందని ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం అమలు చేశామని చెప్పారు. ఆరోగ్య శ్రీ, వైద్య సౌకర్యాన్ని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.10 లక్షల వైద్య సదుపాయం కల్పించామని తెలియజేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు, సేవారంగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు.
రైతుబంధు ఆలస్యం చేస్తున్నారంటూ మాజీమంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొట్టిపారేశారు.పదేళ్లు ప్రజలకు ఏమీ చేయని వారు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సీతారామ నుంచి గోదావరి నీళ్లతో ఖమ్మం ప్రజల కాళ్లు కడగుతానని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. గత పాలకుల హయాంలో జిల్లా అధికారులు తప్పులు చేశారన్న మంత్రి తుమ్మల వాటిని సరిదిద్దుకోవాలంటూ యంత్రాంగాన్ని సునితంగా హెచ్చరించారు.
ఈ ఆరు గ్యారెంటీలకు వారెంటీ లేదన్న పెద్దలకు చెంప దెబ్బ తగిలేటట్టుగా అధికార పగ్గాలు ఎక్కిన మరుక్షణమే, ఆలస్యం చేయకుండా గ్యారెంటీల్లో అత్యంత ప్రధానమైన మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత బస్సు స్కీంను శనివారం లాంఛనంగా ప్రారంభించాం. అదే విధంగా మరో ముఖ్య పథకం రాజీవ్ ఆరోగ్య శ్రీతో ఏడాదికి రూ.10 లక్షలు వైద్యం నిమిత్తం అందిస్తున్నాం. అధికారంలోకి వచ్చి రెండు రోజులు కాకముందే రెండు గ్యారెంటీలను మొదలుపెట్టాం.-భట్టి విక్రమార్క, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి
ఒక మాజీమంత్రి అంటున్నారు, ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే రెండు రోజులు అయిపోయింది. మీరు ఆరు గ్యారెంటీల్లో ఏమి చేశారని, కనీసం ఆలోచించి మాట్లాడాలి. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టుకున్న మీరా తెలంగాణ ప్రజలకోసం మాట్లాడేది? రెండు రోజుల్లోనే రైతుబంధు గురించి మాట్లాడుతున్నారు కానీ రాష్ట్రం ఆదాయాన్ని మీ అకౌంట్లోకి తరలించుకొన్నారే, తెలంగాణ ప్రజల సొమ్ము ఎక్కడుంది? -పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ మంత్రి
తెలంగాణ ప్రజల నమ్మకం మంత్రి భట్టి విక్రమార్క మీద ఉంది. అందుకే కాంగ్రెస్ అధిష్ఠానం, సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించింది. రెండో అత్యంత కష్టమైనది కరెంట్, రాష్ట్రంలో రూ.85000 కోట్ల అప్పులతో ఉన్న విద్యుత్ శాఖను సైతం ఆయనకే ఇచ్చారు. వీరి సాయంతో వ్యవసాయానికి కావాల్సిన విద్యుత్ సరిగా అమలు చేసుకొని, ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలు సేద్యం రావటమే నా లక్ష్యం.-తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి
కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని కోరాను: రేవంత్ రెడ్డి
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన కాంగ్రెస్‌ను మరవద్దు : జగ్గారెడ్డి