వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పారిశుద్ధ్య పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధులతో పాటు డెంగీ నివారణపై సర్పంచులు, కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మలేరియా అధికారి సైదులు హాజరయ్యారు.
అపరిశుభ్రమైన నీరు, మూతలేని నీటి ట్యాంకులు, తాగి పడేసిన కొబ్బరిబోండాల్లో ఉండే దోమల వల్ల డెంగీ వస్తుందని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. డెంగీ జ్వరాల తీవ్రతలో గతేడాది ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని.. ఈసారి ఆ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు ప్రణాళికాబద్ధంగా మురికి కాలువలు శుభ్రం చేయడంతో పాటు, జనావాసాల్లో చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు.
రక్షిత మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయడంపై సర్పంచులు, కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో డెంగీ జ్వరాలపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో మహాలక్ష్మి, మండల వైద్యాధికారి శాంతా రాణి, ఎం.పి.వో.కిశోర్ తదితరులు పాల్గొన్నారు.