మహారాష్ట్రలోని పుణే నగరం నుంచి 17 మంది ప్రత్యేక బస్సుల్లో ఈ నెల 14వ తేదీ రాత్రి మధిర మండలం మహదేవపురానికి చేరుకున్నారు. జిల్లా సరిహద్దుల్లోని చెక్‌పోస్ట్ వద్ద వీరి వివరాలు నమోదయ్యాయి. స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బంది ఈ నెల 16న ఏడుగురిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి పరీక్షలు చేయించారు. ఇందులో ఒకరికి పాజిటివ్ అని తేలడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. పుణే నుంచి వచ్చిన ఆ ప్రత్యేక బస్సు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లింది.
అప్రమత్తమైన యంత్రాంగం
మహదేవపురానికి చేరుకున్న ప్రయాణీకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో మంగళవారం వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పోలీసు శాఖలు అప్రమత్తయ్యాయి. తెల్లారేసరికి 10 బృందాలు గ్రామానికి చేరుకొని జల్లెడ పట్టారు. దాదాపు 400 నివాసాలున్న గ్రామంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. గ్రామాన్ని కలెక్టర్ కంటైన్మెంట్ ప్రాంతంగా ప్రకటించి రాకపోకలను నిలిపివేశారు. కరోనా బాధితుడితో సన్నిహితంగా మెలిగినట్టు అనుమానించిన 52మందిని ఖమ్మంలోని శారదా ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. గ్రామస్థులందరూ తమ ఇళ్లలోనే క్వారంటైన్ పాటించాలని స్పష్టం చేశారు.
సరిహద్దుల్లో గుర్తింపు
లాక్‌డౌన్ సడలింపు తర్వాత ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వ్యక్తులు, వలస కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు స్వస్థలాలకు తిరిగి వస్తుండటంతో జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులను పటిష్ఠం చేశారు. మే 1నుంచి శిబిరాల వద్ద పోలీసులతోపాటు రెవెన్యూ, ఆరోగ్య శాఖ సిబ్బంది బయట ప్రాంతాల నుంచి వచ్చే వారి వివరాలను సేకరిస్తున్నారు.
ప్రతి రోజు సాయంత్రానికి కలెక్టరేట్‌కు పంపించి మండలాల వారీగా జాబితా సిద్ధం చేస్తున్నారు. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆరోగ్య శాఖ సిబ్బంది స్థానికంగా వచ్చినవారి ఆరోగ్య స్థితిగతులను సమీక్షిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చినవారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రాథమిక పరీక్షల అనంతరం అవసరమైన వారి నమూనాలు సేకరించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నారు. మహదేవపురం గ్రామానికి చెందిన బాధితుణ్ని కూడా ఇలానే గుర్తించారు.