ఖమ్మం జిల్లా నేరడ రెవెన్యూ పరిధిలోని వివాదాస్పద భూమి విషయమై ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గత కొన్నేళ్లుగా రెండు కుటుంబాల మధ్య వివాదం జరుగుతోంది. వారిలో ఓ కుటుంబం ఆర్డీవో కార్యాలయాన్ని ఆశ్రయించగా గతంలో ఇచ్చిన పాసుపుస్తకాన్ని రద్దు చేస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.
భూమి సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇరు కుటుంబాలను ఆ భూమిజోలికి వెళ్లొద్దని స్థానిక తహసీల్దారు ఇరు కుటుంబాల వారికి సూచించారు. కానీ ఈ మధ్యకాలంలో ఓ కుటుంబానికి చెందిన వృద్ధురాలు మృతి చెందడం వల్ల ఆమె మృతదేహాన్ని ఆ కుటుంబ సభ్యులు వివాదాస్పద భూమిలో ఖననం చేశారు. ఈ విషయం తెలిసి మరో కుటుంబానికి చెందిన మహిళ చింతకాని తహసీల్దారు కార్యాలయం ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడం వల్ల ఆందోళన విరమించింది.
ఇదీ చూడండి : ఈటీవీ భారత్ స్పందన: '‘పీఎం కిసాన్’'లో తెలంగాణకు చోటు