కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం సిరిసేడు (Siricedu) గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Ys Sharmila) నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి షబ్బీర్ కుటుంబాన్ని షర్మిల తొలుత పరామర్శించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం దీక్షలో పాల్గొన్నారు. సాయంత్రం 6:00 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. అధినేత్రికి మద్దతుగా పార్టీ శ్రేణులు తరలివచ్చాయి.
కన్నీటి పర్యంతం
దీక్షా స్థలిలో కళాకారుల ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను గుర్తు చేసుకుంటూ కళాకారులు పాటలను పాడారు. ఆ పాట విని షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ స్మృతులను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకున్నారు.
హుస్నాబాద్‌లో షర్మిలకు ఘనస్వాగతం
హుజూరాబాద్ నియోజకవర్గంలో నిరుద్యోగ నిరాహార దీక్షకు వెళ్తున్న వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఘనస్వాగతం పలికారు. దూరపు బంధువుల ఇంటివద్ద షర్మిల కాసేపు ఆగారు. వరుసకు సోదరులైన పట్టణానికి చెందిన పాకాల రాజిరెడ్డి, తిరుపతి రెడ్డి షర్మిలకు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆడబిడ్డ షర్మిలకు పట్టు వస్త్రాలను బహుకరించారు. దూరపు బంధువుల కుటుంబ సభ్యులతో కాసేపు గడిపిన షర్మిల అనంతరం... దీక్ష కోసం సిరిసేడు గ్రామానికి వెళ్లారు.
నిరుద్యోగ వారం
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా, నిరాహార దీక్ష వారంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వారంగా ప్రకటిస్తున్నట్లు వైఎస్ షర్మిల గతంలో చెప్పారు. అందుకనుగుణంగానే ప్రతిమంగళవారం ఆమె దీక్ష చేస్తున్నారు.
ఇదీ చదవండి: ACB: తనిఖీలు వద్దనుకుంటే పైసలివ్వాలి.. దుకాణదారులతో అధికారి బేరసారాలు!