గ్రామాల్లో ఆందోళనలు వ్యక్తమవుతుంటే.. పట్టణాల్లో మాత్రం ఓటర్లు వారివారి వార్డు నాయకులను నిలదీస్తున్నారు. దీంతో.. స్థానికంగా ఉన్న నాయకులు తామెందుకు నియోజకవర్గంలోనే ఉన్నామురా దేవుడా అని తలలు పట్టుకుంటున్న పరిస్థితి తయారైంది. చాలాచోట్ల స్థానికంగా ఉన్న నాయకులనే ఓటర్లు టార్గెట్ చేస్తున్నారు. స్థానికంగా ఉన్న వైషమ్యాలను దృష్టిలో పెట్టుకొనే తమకు అన్యాయం చేశారని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నిన్న కవర్ల విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేయగా.. హుజూరాబాద్‌లోని కొత్తపల్లిలో గ్రామస్థులు రోడ్డెక్కారు. తమకు డబ్బు అందలేదని గ్రామంలోని ఓ ప్రాంతపు మహిళా ఓటర్లంతా కలిసి ఏకంగా ఆందోళనకు దిగారు. ఆ ప్రాంతానికి చెందిన మహిళలు, వృద్ధులంతా కలిసి ఓ వ్యక్తిని చుట్టుముట్టేశారు. ఈ వార్త కూడా వైరల్‌గా మారటం వల్ల... ఈరోజు కూడా నియోజకవర్గంలో కవర్లు అందని మిగతా గ్రామాల్లోని ఓటర్లు కూడా రోడ్లెక్కేశారు. తమ తమ స్థానిక నాయకులను చుట్టుముట్టేసి.. కడిగేస్తున్నారు. "ఇస్తే... అందరికీ ఇవ్వాలి.. లేకపోతే ఎవ్వరికీ ఇవ్వకూడదు".. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పైసలిస్తేనే ఓట్లు.. లేకపోతే లేదు..
"ఒక్కొక్క ఓటుకు కవరులో ఆరు వేల రూపాయల చొప్పున ఇస్తున్నారు. మా ఇళ్లలో కూడా ఓట్లు ఉన్నాయి. మరి మాకెందుకు ఇవ్వరు. మా ఇంట్లో ఐదు ఓట్లున్నాయి. ఇస్తే అందరికి ఇయ్యాలే. ఇయ్యకపోతే మొత్తానికే ఇయ్యద్దు. కొందరికి ఇచ్చి.. మాకెందుకు ఇస్తలేరు. పల్లెల్లో ఓటుకు 6 వేలు ఇస్తున్నారట.. సిటీల్లో 10 వేలు పంచుతున్నారట. మాకైతే.. ఒక్క రూపాయి కూడా ఇప్పటి దాకా అందలే. మాకు డబ్బు ఇస్తేనే ఓట్లు వేస్తాం. లేకపోతే .. అసలు ఎవ్వరికీ ఓట్లు వేయం" -మహిళా ఓటర్లు
పోలీసులకు కొత్త తలనొప్పులు..
హుజురాబాద్ నియోజవకర్గంలో జరుగుతున్న ప్రలోభాల పర్వంలో తమకు కచ్చితంగా ఓట్లు వేస్తారనే వారికి మాత్రమే తాయిలాలు పంపిణీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోపక్క సీల్డ్ కవర్లలో నగదు తగ్గినట్టుగా కూడా స్థానికంగా ఆందోళనలు చేస్తున్నారు. దీంతో పోలీసులకు సరికొత్త సమస్యలు ఎదురౌతున్నాయి. సీల్డ్ కవర్ల పంపకాల పంచాయితీ కాస్తా... రోడ్డెక్కడంతో గ్రామగ్రామాన బందోబస్తు చేయడం.. ఆందోళన చేస్తున్న వారిని నచ్చచెప్పే పనిలో పోలీసులు తలమునకలయ్యారు.
ఇదీ చూడండి: