Vending zones in Karimnagar: కరీంనగర్‌లో వీధి వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు నగరపాలక సంస్థ పకడ్బందీ ప్రణాళిక అమలు చేస్తోంది. రోడ్ల ప్రక్కన కూరగాయలు విక్రయించడం వల్ల ట్రాఫిక్ అంతరాయంతో పాటు.. దుమ్ము ధూళి చేరి కూరగాయలు పాడైపోయే ప్రమాదముందని గ్రహించిన అధికారులు.. నగరం నలువైపులా వెండింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రణాళికలు మెచ్చుకొదగినవే అయినా నిధుల కొరతతో పనులు నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందువరసలో ఉండే నగరం కరీంనగర్. పెద్ద ఎత్తున వ్యాపారాలు జరుగుండటంతో నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. దానితో పాటు రోడ్లను ఆక్రమించుకొని వ్యాపారాలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. వాయు కాలుష్యం వల్ల కూరగాయలపై దుమ్ము దూళి చేరి పాడవడంతో పాటు రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి.
కరీంనగర్‌కు చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున కూరగాయలు తీసుకస్తుంటారు. అయితే వాటిని విక్రయించడానికి తగిన సదుపాయాలు లేకపోవడంతో రోడ్ల ప్రక్కనే అమ్మకాలు జరుపుతారు. అవి కూడా కేవలం ఒకటి రెండు ప్రాంతాలలో ఉండటంతో రహదారుల పైకి జనం చేరి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. గంటలతరబడి రోడ్లపైనే ఉండటంతో వాహనాలనుంచే వచ్చే పొగపీల్చి ఆరోగ్యం సైతం పాడవుతోందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యను గుర్తించిన నగరపాలక సంస్థ.. పరిష్కారం దిశగా అడుగులు వేసింది. నలువైపులా ఇంటిగ్రెటెడ్ మార్కెట్లతో పాటు వెండింగ్ జోన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తుండటంతో వాటితో మౌలిక సదుపాయాలు చేపడుతున్నట్లు నగర మేయర్ సునీల్‌రావు తెలిపారు. వీధి వ్యాపారుల ఈ సమస్యను తొలగించి, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.
అయితే నిధుల కొరత కారణంగా కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తి కావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలు పూర్తి అయిన వెండింగ్ జోన్ల పంపిణీ చేపట్టడమే కాకుండా మిగతా నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే నిర్మించిన వెండింగ్ జోన్ల పంపిణీ ఇంకా జరగలేదని వీటిలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని రైతులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి: