ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సీతారామ కల్యాణం ఘనంగా జరిగింది. వేడుకల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు జరిపారు.
ముందుగా శ్రీ సీతారాముల విగ్రహాలకు పంచ ఉపనిషత్తు ద్వారా అభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామి వార్లకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం గర్భగుడిలోని మూల విరాట్టు వద్ద కల్యాణం జరిపి ఉత్సవమూర్తులను మండపం పైకి తీసుకొచ్చారు.
ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేములవాడ పురపాలక సంఘం కమిషనర్ గంగారాం దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాస రావులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
భక్తులతో కిక్కిరిసిన ఆలయం
సీతా పరిణయం వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు. రద్దీ పెరిగి ఆలయ ఛైర్మన్ అతిథి గృహం ముందు ఏర్పాటుచేసిన వేదిక వద్ద గ్యాలరీలన్నీ నిండిపోయాయి. పూజారుల వేదమంత్రాల నడుమ సీతారాముల వివాహం కనులపండువగా సాగింది.
వేడుకలో హిజ్రాల సందడి
శ్రీ సీతారాముల కల్యాణానికి హిజ్రాలు పెద్దఎత్తున హాజరయ్యారు. పెళ్లి జరుగుతున్నంత సేపు పరస్పరం ఒకరిపై ఒకరు తలంబ్రాలు చల్లుకుంటూ సందడి చేశారు. పరమేశ్వరునితో వివాహం జరుగుతున్నట్లు ఊహించుకుంటూ...పెళ్లిళ్లు చేసుకున్నారు. హిజ్రాల సందడి చూసేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు.