కరీంనగర్ తలాపున దిగువ మానేరు జలాశయం ఉన్నా... తాగునీటి సరఫరా సరిగ్గా లేక నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరానికి రోజూ తాగునీరు సరఫరా చేసేందుకు కనీసం 48ఎమ్ఎల్డీల నీటి నిలువ సామర్థ్యం గల ట్యాంకులు ఉండాలి. కానీ, కేవలం 36ఎమ్ఎల్డీల సామర్థ్యం ఉన్న ట్యాంకులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో నగరవాసులకు రోజు విడిచి రోజు గంటపాటు మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతోంది. దీనిని అధిగమించి ప్రజలకు రోజూ తాగునీరు అందించడానికి ప్రభుత్వం మొత్తం నగరంలో 320 కిలోమీటర్ల పైప్‌లైన్ల నిర్మాణం పూర్తి చేసేందుకు... రూ. 109 కోట్ల 26 లక్షలు కేటాయించింది.
ప్రస్తుతం నగర పరిధిలో హైలెవల్, లోలెవల్ జోన్ అర్బన్ మిషన్ భగీరథ పథకం కింద... నిత్యం తాగునీరు సరఫరా చేసేందుకు పనులు పూర్తిచేశారు. అర్బన్ మిషన్ భగీరథలో భాగంగా శివారు కాలనీలతో పాటు, పాత పైపులైన్ల స్థానంలో కొత్తవి వేసేందుకు చర్యలు చేపట్టారు.
నిల్వ కేంద్రాల డిజైన్లు తయారు
ఇప్పటి వరకు 315 కిలోమీటర్ల పొడవునా పైపులైన్లు ఉండగా... 110ఎంఎం డయా పైపులైను 147 కిలోమీటర్లు, 150ఎంఎం, 600ఎంఎం డయా పైపులైన్లను 27.55 కిలోమీటర్ల మేర విస్తరించారు. భగీరథ కింద చేపడుతున్న తాగునీటి సరఫరా పనుల్లో జనాభాకు తగ్గట్లు నీటి నిల్వ కేంద్రాల ఏర్పాటుకు డిజైన్లు తయారు చేశారు. 2033 నాటికల్లా పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని 4 లక్షల 3 వేల మందికి సరిపడేలా... 68.65ఎమ్ఎల్డీల సామర్థ్యం గల ట్యాంకుల పనులు పూర్తి చేసినట్లు తెలిపారు.
సమతుల్య రిజర్వాయర్లు
ఎత్తైన ప్రదేశంలోకి నీటిని పంపింగ్ చేస్తే అక్కడి నుంచి నేరుగా దిగువకు తరలించి... వాటి ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేసే అవకాశం ఉంది. దీనికోసం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తిచేశారు.
పనుల పూర్తి.. వచ్చేనెలలో తాగునీరు అందుతాయ్
శాతవాహన విశ్వవిద్యాలయం దగ్గర ఉన్న గుట్టపై 30లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తో పాటు... 800 కిలోలీటర్ల సామర్థ్యం గల సంపు, పంపుహౌజ్‌ను నీటి శుద్ధి కేంద్ర ఆవరణలో నిర్మించారు. ఇప్పటికే 7.7 కిలోమీటర్ల పొడవున నీటిశుద్ధి కేంద్రం నుంచి శాతవాహన వర్సిటీ వరకు పైపులైను పూర్తికాగా... రాంనగర్ రిజర్వాయర్‌లో అదనంగా 13 వందల కిలోలీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ట్యాంకు పనులు చివరిదశకు చేరుకున్నాయని మేయర్ సునీల్‌రావు వెల్లడించారు. హౌసింగ్ బోర్డు కాలనీలో 2200 కిలోలీటర్ల సామర్థ్యంతో చేపడుతున్న రిజర్వాయర్ పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.
ఈనెల చివరి వారంలో ట్రయల్‌రన్ ప్రారంభించి ఏప్రిల్ నుంచి నీటి సరఫరా మొదలు పెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తరచూ తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న వేళ... శాశ్వతంగా సమస్య పరిష్కారమైందని నగరవాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఇదీ చదవండి: 8 వేలు దాటిన కరోనా మరణాలు.. 2లక్షలకు పైగా కేసులు