Srivari Temple in Karimnagar : కరీంనగర్ జిల్లాలోని పద్మానగర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్మాణానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భూమిపూజ చేశారు. ఈ ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే టీటీడీ నిర్మాణం చేస్తుందని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ రూ.20కోట్లు ఇవ్వనున్నట్లు ఛైర్మన్ తెలిపారు. దీంతో పాటు మరో రూ.20కోట్లు దాతల సహకారంతో ఆలయ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. తిరుపతిలో నిర్వహించే స్వామివారి కైంకర్యాలు ఈ ఆలయంలోనూ నిర్వహిస్తామని చెప్పారు.
TTD Constructs Srivari Temple in Karimnagar : శ్రీనివాస పద్మావతి ఆలయాల మాదిరిగానే పద్మానగర్‌లో ఆలయ నిర్మాణం చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. సాయం చేయడానికి దాతలు ఎవరైనా ముందుకు వస్తే మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ దేవాలయాన్ని రెండు సంవత్సరాల్లో భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తారని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్మాణం చేపట్టడం హర్షణీయమని అన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, తెలంగాణ ప్రణాళిక బోర్డు వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Bandi Sanjay visited Srivari temple in Karimanagr : ఈ ఆలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కలియుగ దైవంగా ఏడుకొండలపై విరాజిల్లుతున్న వెంకటేశ్వర స్వామిని ప్రజల వద్దకే తీసుకురావడానికి టీటీడీ అనేక ప్రయత్నాలు చేస్తోందని సంజయ్ అన్నారు. కోరిన కోరికలు తీర్చే.. కొంగుబంగారంగా భావించే వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు విదేశీయులు కూడా ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. ఏడుకొండలపై ఉన్న వెంకటేశ్వరుణ్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీటీడీ అనేక ధార్మిక కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహిస్తోందని చెప్పారు. టీటీడీ స్వయంగా రూ.20 కోట్లలతో కరీంనగర్లో ఈ ఆలయం నిర్మించడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. ఎంతోమంది పేదలు వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు ఇబ్బందులు పడుతుంటారని.. ఈ క్రమంలో కరీంనగర్‌లోనే ఆలయ నిర్మాణానికి పూనుకోవడం సంతోషకరమన్నారు.
Bandi Sanjay comments on MIM Party : ఈ సందర్భంగా బండి సంజయ్ ఎంఐఎం పార్టీపై పలు విమర్శలు చేశారు. ఎంఐఎం పార్టీని బీఆర్ఎస్ పెంచి పోషిస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ, అసదుద్దీన్ ఒవైసీ ఓల్డ్ సిటీకి చేసింది ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఓల్డ్ సిటీ ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి ఎంఐఎం మద్దతు తెలుపుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ హైదరాబాద్ దాటి ఎందుకు పోటీ చేయదని అడిగారు. ముస్లిం సమాజం కోసం పోరాడే పార్టీ అయితే తెలంగాణ మొత్తం పోటీ చేయాలి కదా అని నిలదీశారు.
"ఎంఐఎం పార్టీ అధికారంలో ఏ పార్టీ ఉంటే వారికి మద్దతు ఇస్తుంది. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఈ పార్టీల లక్ష్యం బీజేపీని రాష్ట్రంలో రాకుండా చేయడమే. ఈ విషయాన్ని మేము మొదటి నుంచి చెబుతున్నాం."- బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి :