huzurabad bypoll: ధరలు ఎప్పుడు తగ్గిస్తారో చెప్పి హుజూరాబాద్‌లో ఓట్లడగండి: హరీశ్‌రావు - తెలంగాణ తాజా వార్తలు
రైతులు కారెక్కాలని సీఎం కేసీఆర్ ఆశపడుతుంటే.. భాజపా మాత్రం రైతులపైన కారెక్కించి చంపుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. నిత్యావసరాల ధరలు పెంచుతూ పేదలపై భారం వేస్తోందని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని విమర్శించారు.
![huzurabad bypoll: ధరలు ఎప్పుడు తగ్గిస్తారో చెప్పి హుజూరాబాద్‌లో ఓట్లడగండి: హరీశ్‌రావు huzurabad bypoll](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13445070-490-13445070-1635072857433.jpg?imwidth=3840)
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచుతూ సామాన్యులపై భారం వేస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు (minister harish rao) మండిపడ్డారు. ధరల పెరుగుదల పాపం ముమ్మాటికీ భాజపాదేనన్నారు. రూ. 500 ఉన్న గ్యాస్ సిలిండర్‌ను రూ.1000 చేశారని.. మళ్లీ 500 రూపాయలకే సిలిండర్ ఎప్పుడిస్తారో చెప్పిన తర్వాతనే భాజపా నేతలు ఓట్లు అడగాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నిక (huzurabad bypoll) తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు మద్దతుగా మంత్రి హరీశ్‌రావు మాచనపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే.. భాజపా, కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలను సమర్థంగా తిప్పికొడుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని విమర్శించారు.
'నూతన సాగు చట్టాలను రద్దుచేయాలంటూ ఉత్తరప్రదేశ్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల మీదకు కార్లు ఎక్కించిన పార్టీ భాజపా. ఆ ఘటనలో అక్కడికక్కడే నలుగురు రైతులు చనిపోయారు. రైతులు కారెక్కాలని.. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశపడుతుంటే .. రైతుల మీదకు కారెక్కించి చప్పుతామంటున్నది భాజపా. ధరలు పెంచిన రైతుల మీద భారం వేసిన భాజపాకు ఎందుకు ఓటెయ్యాలి. పెట్రోల్, డీజిల్ తోటి 95 శాతం మంది రైతులకు పనేలేదని ఓ కేంద్రమంత్రి అంటున్నరు. డీజిల్, పెట్రోల్ పనిలేని రైతుంటడ. అంత అవగాహన రాహిత్యంలో కేంద్ర మంత్రులున్నారు.'
- హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి
ఇవీచూడండి: