తెరాస కంచుకోటగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. మరోసారి గులాబీ గుబాళించింది. సిరిసిల్ల పురపాలికలో మళ్లీ తెరాస జెండా ఎగిరింది. సిరిసిల్లలో 39 వార్డులు ఉండగా... తెరాస 22 స్థానాలు గెలుచుకుని పురపీఠం నిలబెట్టుకుంది. కాంగ్రెస్ 2, భాజపా 3 మూడు వార్డులతో సరిపెట్టుకోగా... స్వతంత్రులు ఏకంగా 12 స్థానాల్లో విజయం సాధించారు. వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని అధికార పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 28 వార్డులకు 15 స్థానాలు కైవసం చేసుకుంది.
![trs party won in joint karimnagar municipalities in municipal elections 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5839912_.jpg)
జగిత్యాలలో 30 వార్డులు తెరాసవే:
జగిత్యాల మున్సిపాలిటీని తెరాస దక్కించుకుంది. జగిత్యాలలో 48స్థానాలకు గాను 30 వార్డుల్లో కారు గుర్తు అభ్యర్థులే జయభేరి మోగించారు. కోరుట్లలో 33 వార్డులకు 21 స్థానాల్లో గెలుపొందిన తెరాస... పురపీఠాన్ని దక్కించుకుంది. మెట్‌పల్లి మున్సిపాలిటీలో కారుదే హవా సాగింది. ఇక్కడ 26 వార్డులు ఉండగా తెరాస 16 స్థానాల్లో గెలుపొందింది. రాయికల్ మున్సిపాలిటీ తెరాసకే కైవసమైంది. ఇక్కడ 12 వార్డులకు తెరాస 9 స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. ధర్మపురిలో 15 వార్డులు ఉండగా తెరాస 8 స్థానాలు గెలుచుకొని విజయం సాధించింది. కాంగ్రెస్ 7 వార్డులు గెలుచుకుని గట్టి పోటీ ఇచ్చింది.
![trs party won in joint karimnagar municipalities in municipal elections 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5839920_.jpg)
జమ్మికుంటలో కారుకు 22 స్థానాలు:
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో తెరాస ఏకపక్ష విజయం సాధించింది. 12 వార్డుల్లో.. తెరాస 11 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ ఒక్కస్థానంతో సరిపెట్టుకుంది. చొప్పదండి మున్సిపాలిటీలో 14 వార్డులకు గాను తెరాస 9 స్థానాలు గెలుచుకుని ఛైర్మన్ పీఠం సాధించింది. భాజపా, కాంగ్రెస్ చెరో రెండు వార్డులు గెలుచుకోగా.. ఇతరులు ఒకటి సాధించారు. జమ్మికుంట పురపాలికలో కారు జోరు కొనసాగింది. జమ్మికుంటలో 30 వార్డులు ఉండగా.. 22 స్థానాలతో తెరాస విజయ దుందుబి మోగించింది. హుజురాబాద్‌లోనూ అధికార పార్టీ హవానే కొనసాగింది. మొత్తం 30 స్థానాలకు తెరాస 21 గెలుచుకుని సత్తా చాటింది.
![trs party won in joint karimnagar municipalities in municipal elections 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5841979_-.jpg)
పెద్దపల్లిలో తెరాస జెండా:
పెద్దపల్లి మున్సిపాలిటీపై తెరాస జెండా పాతింది. ఇక్కడ 36 వార్డులు ఉండగా.. 23 స్థానాలు గెలుచుకుని పురపీఠం దక్కించుకుంది. సుల్తానాబాద్ పురపాలికలో తెరాస విజయం సాధించింది. ఇక్కడ 15 స్థానాలు ఉండగా.. 9 స్థానాలు గెలుచుకుని ఛైర్మన్ పీఠం కైవసం చేసుకుంది. మంథని పురపాలికలో సైతం గులాబీ జెండా రెపరెపలాడింది. ఇక్కడ మొత్తం 13 స్థానాలు ఉండగా ... 11 స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది.
![trs party won in joint karimnagar municipalities in municipal elections 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5839918_.jpg)
ఇవీ చూడండి:బస్తీకా బాద్షా: పట్టణాల్లో గులాబీ పార్టీకి పట్టం..