ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో చనిపోయిన రైతుది ప్రభుత్వ హత్యగా అభివర్ణించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాన్ని టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి పొన్నం పరామర్శించారు. తాలు పేరుతో రైతులకు జరిగే మోసం... జాప్యాన్ని తట్టుకోలేకనే రైతు మృతి చెందాడని ఆరోపించారు. జిల్లాలో నలుగురు మంత్రులు ఉన్నా రైతులను పట్టించుకోవటం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల పనితీరుపై ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ నివేదికలను తెప్పించుకోవాలని సూచించారు.
ధాన్యాన్ని ఐకేపీ కేంద్రానికి తీసుకొచ్చిన రైతు... కొనుగోళ్ల కేంద్రలో జాప్యం వల్ల తాను తెచ్చిన ధాన్యంపైనే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ప్రభుత్వానికి చెంపపెట్టుగా భావిస్తున్నా. ఇది రైతు బుచ్చయ్య ఆకస్మిక మరణం కాదు... ఇది రాష్ట్ర ప్రభుత్వం హత్య. జిల్లాలో ఉన్న నలుగురు మంత్రులు రైసు మిల్లర్లకు మద్దతిస్తున్నారు తప్ప రైతులకు అండగా ఉండడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇంటిలిజెన్స్ ద్వారా నివేదిక తెప్పించుకుని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి వారికి న్యాయం చేయాలి. కొనుగోలు కేంద్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి నిరూపించడానికి కాంగ్రెస్ పక్షాన సిద్ధంగా ఉన్నాం. -పొన్నం ప్రభాకర్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు.
ఇవీ చూడండి: కూలీ బతుకు.. అందని మెతుకు !