వైద్యవృత్తిని ఆదాయం కోసం కాకుండా ప్రాణం కాపాడాలంటూ వచ్చిన వారికి సేవ చేసేందుకు ఉపయోగించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్‌లో జరుగుతున్న 5వ చిన్నపిల్లల వైద్య సదస్సును మంత్రి ఈటల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
దేవుడు జన్మను ప్రసాదిస్తే... వైద్యులు పునర్జన్మనిస్తారని నమ్మే విధంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. వైద్యులు తమకు రక్షణ కల్పించేందుకు చట్టాలను మార్చాలనే డిమాండ్లను చూస్తుంటే తనకు బాధ కలుగుతుందని పేర్కొన్నారు. ఎందుకు దాడులు జరుగుతున్నాయో వైద్యులు ఆలోచన చేసుకోవాలని మంత్రి సూచించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 98 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయనీ... ఈ శాతాన్ని నూటికి నూరు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకోసమే కేసీఆర్ కిట్ అందిస్తున్నామని మంత్రి ఈటల వివరించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందిస్తున్న పలువురు వైద్యులను ఆయన సన్మానించారు. కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో పాటు డాక్టర్ ఎడవల్లి విజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.