H3N2 Virus cases in telangana : రాష్ట్ర వ్యాప్తంగా H3N2 వైరస్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ వైరస్ లక్షణాలు ఉన్న రోగులు ఆసుపత్రిల్లో ఎక్కువ సంఖ్యలో చేరడంతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోంటుంది. బాధితుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు సరైనా నియమ నిబంధనలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. వైరస్ వ్యాప్తికి వాతావరణంలో కలిగిన మార్పులే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
New virus H3N2 patients In Karimnagar : వాతావరణ మార్పుల వల్ల కరీంనగర్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి కొత్త వైరస్ బాధితుల తాకిడి మొదలైంది. రోజూ వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా ఇందులో చిన్నారుల సంఖ్య అధికంగా ఉంటోంది. ఎక్కువ మంది కొత్త వైరస్ H3N2 బారిన పడిన వారే వస్తుండటంతో ఆస్పత్రిలో రద్దీ విపరీతంగా పెరిగింది. బాధితులకు అవసరమైన చికిత్స అందుతుండటంతో ప్రాణాపాయం లేకుండా నాలుగైదు రోజుల్లో తిరిగి ఇంటికి వెళ్తున్నారు.
రోజుకు 150 నుంచి 200 వరకు వస్తున్నారు: ఏటా సీజన్ మారుతున్నప్పుడు చిన్న, చిన్న వైరస్‌ల వల్ల జ్వరాలు సాధారణంగా వచ్చి తగ్గుతుంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన H3N2 వైరస్ తీవ్రత కొంచెం అధికంగా ఉండటంతో బాధితులు ఆస్పత్రుల బాట పడుతున్నారు. అయితే జలుబే కదా అని భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కరీంనగర్, గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరగటంతో వార్డులు కిక్కిరిసిపోతున్నాయి.
ఓపీ చికిత్స కోసం రోజు 150నుంచి 200 మంది వస్తుండగా ఇందులో 70-80 మంది రోగులు H3N2 వైరస్‌తో బాధపడుతున్నవారే ఉంటున్నారు. చిన్న పిల్లల ఓపీకి సైతం రోజు 50కి పైగా వస్తుండగా పదుల సంఖ్యలో ఆస్పత్రిలో చేరుతున్నారు. కరోనా అంతా ప్రమాదకరం కానప్పటికీ గొంతునొప్పి, దగ్గు, చలి, వంటి లక్షణాలు అధికంగా ఉంటున్నాయి. బాధితులకు పరీక్షలు చేసి అవసరమైన వారిని ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే నాలుగైదు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డాక్టర్ల సూచనలు మేరకే మందులు వాడాలి: కొత్త వైరస్ వల్ల ఆస్పత్రులకు జ్వర బాధితుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. అలాగని నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు. జ్వరంతో బాధపడుతున్న పిల్లలను పాఠశాలలకు పంపించడం వల్ల ఇతరులకు వేగంగా వ్యాపించే అవకాశం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రధానంగా రోగనిరోధక శక్తి తగ్గటం వల్లనే జలుబు, జ్వరం బారిన పడతారని వెల్లడించారు. పిల్లలకు ఆరోగ్యవంతమైన, పౌష్ఠికాహారం అందించటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించవచ్చని వైద్యులు తెలిపారు.
ఎండాకాలం శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా నీళ్లు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, చేతులు శుభ్రపరచుకోవడం వంటి జాగ్రత్తలు పాటించి వైరస్ బారి నుంచి తప్పించు కోవచ్చనీ, వ్యాధి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. సొంతంగా మందులు వాడకుండా డాక్టర్ల సూచన మేరకే వాడాలని అంటున్నారు.
"చలి వాతావరణం నుంచి వేడి వాతారణం మార్పు రావడం, కలుషితమైన నీటిని తగడం వల్ల ఎక్కువ మంది జ్వరాలు వస్తున్నాయి. చల్లటి నీరు తగ్గించి, జంక్ ఫుడ్ తినకుండా ఉండి తగిన జాగ్రత్తలు పాటిస్తే వేరంగా తగ్గిపోతుంది."- డాక్ఠర్ పద్మ, ఫిజీషియన్
ఇవీ చదవండి: