రైతులపై కారెక్కించే పార్టీకి కాకుండా రైతులను కారెక్కించాలనుకుంటున్న తెరాస ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు(Telangana Minister Harish Rao) పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లిలో తెరాస అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. నిరంతరం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెరాస సర్కారు పనిచేస్తోందని పునరుద్ఘాటించారు. తప్పుడు మాటలు చెబుతున్న ఈటల రాజేందర్‌కు ఓటేయొద్దని కోరారు.
వంటగ్యాస్ ధరను నిత్యం పెంచడమే కాకుండా గ్యాస్‌పై 291 రూపాయల పన్నును రాష్ట్ర ప్రభుత్వం విధిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు(Telangana Minister Harish Rao) విమర్శించారు. ఏడేళ్లలో భాజపా ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందన్న మంత్రి(Telangana Minister Harish Rao).. ప్రజలకు ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారో ఈటల రాజేందర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
"రైతుల ఆదాయం పెరగాలని, రైతులు కారెక్కి తిరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కర్షకుల కోసం పాటుపడుతున్నారు. కానీ భాజపా.. రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులపై కారెక్కించి నిర్దాక్షిణ్యంగా నలుగురు అన్నదాతలను పొట్టనబెట్టుకున్నారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.1000 అయింది. ఆ ధర పెంచిన భాజపాకు ఓటేస్తారా? గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచిండ్రు. ఉన్న ఉద్యోగాలు తీసేసిండ్రు, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తుండ్రు..ఇంత చేస్తూ ఏం ముఖం పెట్టుకుని భాజపా ఓట్లు అడుగుతోంది."
- హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి