High Court on Bandi Sanjay: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని వ్యక్తిగత పూచీకత్తుపై వెంటనే విడుదల చేయాలని జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగుల విభజనకు సంబంధించిన 317 జీవోను సవరించాలంటూ కరీంనగర్లో దీక్ష చేపట్టిన బండిని పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్‌కి... 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఈ నెల 3న కరీంనగర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో బండి సంజయ్‌ని జైలుకు తరలించారు. రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అత్యవసర విచారణ చేపట్టారు. బండి సంజయ్ తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా బండి సంజయ్ ని రిమాండ్ కు తరలించేందుకే.. ఎఫ్ఐఆర్లో ఐపీసీ 333ని జత చేశారని న్యాయవాది వాదించారు. మెడికల్ రిపోర్టు లేకుండానే కేవలం పోలీసులు చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకొని రిమాండ్‌కు తరలించాలన్నారు.
బండి సంజయ్‌కి రిమాండ్ విధించేటప్పుడు స్థానిక కోర్టు పలు అంశాలను పరిశీలించనట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రదర్శనలు సహజమని... ఎంపీని ముందస్తుగా అదుపులోకి తీసుకొని వదిలేస్తే సరిపోయేది కదా అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. రిమాండ్ ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు... బండి సంజయ్‌ని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అయితే తన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని బండి సంజయ్‌కి ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.
జాగరణ దీక్ష భగ్నం
Bandi Sanjay arrest: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జారీ చేసిన 317 జీవోకు వ్యతిరేకంగా ఈ నెల 2 న కరీంనగర్లో బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేయనున్నట్లు ఆయన ప్రకటించగా దీక్షకు మద్దతుగా జిల్లాల నుంచి వస్తున్న నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకుని ఠాణాలకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, భాజపా నాయకులకు మధ్య... పలుమార్లు తోపులాటలు జరిగాయి.
కరీంనగర్ జైల్లో బండి సంజయ్
దీక్షకు అనుమతిలేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆంక్షలను తప్పించుకొని.. కార్యాలయంలోకి వెళ్లి సంజయ్ దీక్ష చేపట్టగా, పోలీసులు తలుపులు పగులగొట్టి.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, భాజపా కార్యకర్తల మధ్య.. తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. బండి సంజయ్‌ను అరెస్టు చేసి.. కరీంనగర్ కోర్టుకు తరలించారు. కోర్టు ఆయనతో సహా మరో ఐదుగురికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.
ఈ క్రమంలో దిగువ కోర్టు విధించిన రిమాండ్‌ను రద్దుచేయాలని కోరుతూ.. బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఆయనను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అరెస్టు