Aqua Tunnel At Karimnagar: కరీంనగర్‌లో అండర్ వాటర్ టన్నెల్ అద్భుత అనుభూతికి వేదికైంది. వాటర్ టన్నెల్ ఎక్స్‌పోతో మాయా ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతిని కలిగిస్తుండటంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు రంగు రంగుల చేపలను వీక్షించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. సముద్రం అడుగు భాగంలో ఉండే వింత జీవరాశులు అలా కళ్ల ముందు కదలాడుతుంటే కరీంనగర్‌లో ఉన్నామా.. లేక మరేదైన లోకంలో ఉన్నామా...? అన్నట్టుగా సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది.
500 రకాలు చేపలు ఒకే దగ్గర: దేశవిదేశాల్లోని జలచరాలు కరీంనగర్‌లో దర్శనమిస్తున్నాయి. నిత్యం యూట్యూబ్, సినిమాల్లో చూసే చేపలన్నీ మనపక్క నుంచి వెళ్తుంటే ఆ అనుభూతి వర్ణనాతీతం. దాదాపు 500 రకాల చేపలు ఒకే చోట కనిపిస్తుంటే చిన్నారుల దగ్గర్నుంచి పెద్దల వరకు కనురెప్పలు వాల్చకుండా తిలకిస్తున్నారు. ఎగ్జిబిషన్‌లో అరపైమా, లయన్, రెడ్ టైల్, ఆస్కార్, జిబ్రా, టైగర్, షార్క్ జాతుల చేపలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సింగపూర్, మలేషియా, దుబాయి తదితర దేశాల లభించే చేపలు స్థానికంగా కనిపించడంతో వాటికి చూడటానికి వీక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.
దాదాపు రూ.4కోట్ల ఖర్చుతో: అక్వేరియంలో మాత్రమే కనిపించే చేపల్ని టన్నల్‌లో చూస్తుంచే కొత్త అనుభూతి కలుగుతుందంటున్నారు సందర్శకులు. కరోనా తర్వాత ఎగ్జిబిషన్లకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆటవిడుపు కోసం నూతన మార్గాల దిశగా ఏర్పడిందే ఈ టన్నెల్. దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో నిర్వాహకులు ఈ మీనా లోకాన్ని ఏర్పాటు చేశారు. వేసవి సెలవులకు ఈ ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇలాంటి ప్రదర్శన ప్రతి ఏడాది ఏర్పాటు చేయాలని సందర్శకులు కోరుతున్నారు.
చిన్నారుల విజ్ఞానం కోసం: సముద్రపు ఉప్పు నీటిలోనూ, మంచి నీటిలోనూ జీవించే విభిన్న మత్స్య జాతులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చిన్నారులకు ఎంతో విజ్ఞానాన్ని అందించే విధంగా ఈ ప్రదర్శనను తీర్చిదిద్దారు. వీటి నిర్వహణ ఎంతో కష్టంతో కూడిన పనిగా నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతిరోజు నీటిని శుద్ధి చేయడం.. సకాలంలో చేపలకు ఆహారాన్ని సమకూర్చడం పట్ల సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.
అండర్ వాటర్ టన్నెల్‌ను పూర్తిగా ఎయిర్ కండీషన్‌తో ఏర్పాటు చేయడంతో వేసవిలో చల్లచల్లగా.. రంగు రంగుల చేపలను చూసినవారు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. కుటుంబ సమేతంగా మత్స్యలోకాన్ని తిలకిస్తు స్థానికులు... ఆనంద పారవశ్యానికి లోనవుతున్నారు.
ఇవీ చదవండి: