Karimnagar Bala Bhavan: దాదాపు 40 ఏళ్ల తర్వాత కరీంనగర్ జిల్లాలో బాలభవన్ కల నెరవేరింది. 1970లో బాల భవన్‌కు శంకుస్థాపన జరిగినా బాలకేంద్రంగా ఇప్పటి వరకు కొనసాగింది. గతంలో బాలకేంద్రంలో శిక్షణ తరగతులు కేవలం రోజులో 3 గంటలు మాత్రమే నిర్వహించేవారు. డబ్బులు పెట్టి శిక్షణ పొందలేని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇక్కడ నృత్యం, సంగీతం, వాయిద్యం, కుట్టు, అల్లికలు, చిత్రలేఖనం లాంటి వాటిలో శిక్షణ తరగతులకు హాజరయ్యేవారు. కొందరు సేవా దృక్పథంతో కీబోర్డు, వేణువు లాంటి శిక్షణ తరగతులు అందించేవారు.
రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ బాలకేంద్రాన్ని బాలభవన్‌గా ఉన్నతీకరణ చేయడంతో.. సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతులు ఉంటాయి. ముఖ్యంగా జిల్లా విద్యాశాఖ కేటాయించిన సమయానుకూలంగా ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో సాంస్కృతిక కళాంశాలను బోధించే అవకాశం ఉంటుంది. శుక్రవారం వీరికి సెలవు దినం ఉంటుంది. బాలభవన్‌లో గౌరవ వేతనంతో పనిచేస్తున్న రెగ్యులర్ ఉపాధ్యాయులకు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి వేతనాలు అందనున్నాయి.
'కళల ద్వారా పిల్లలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కేవలం వేసవి సెలవుల్లోనే కాకుండా ఏడాది పొడవునా.. పాఠశాల అయిపోయాక విద్యార్థులకు నేర్పిస్తే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ప్రభుత్వ కార్యక్రమం కోసం బాలభవన్నే సంప్రదిస్తారు. ప్రభుత్వం కల్పించే ఇలాంటి సంస్థల ద్వారా సాంస్కృతిక కళాంశాలను పిల్లలకు నేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబరచాలి.' -మంజుల బాలభవన్, సూపరింటెండెంట్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే విద్యార్థిని విద్యార్థులకు ఇలాంటి శిక్షణలు ఎంతో దోహదపడతాయని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఆసక్తితో ఈ కళలను నేర్చుకొనే విద్యార్థులకు.. ఉపాధ్యాయులు కూడా అంతే ఆసక్తితో నేర్పిస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో మంది విద్యార్థులకు ప్రతిభ ఉన్నా సరైన శిక్షణ, వసతులు లేక కళాంశాలకు దూరమవుతున్నారు. బాలభవన్ వేసవి శిక్షణ శిబిరంలో.. ఎంతో మంది పిల్లలు చక్కటి కళలను నేర్చుకుంటున్నారు.
'కేవలం పదిరోజుల్లో 400 మంది వరకూ ఇందులో చేరారు. నృత్యాలు, వివిధ అంశాల్లో శిక్షణ నేర్చుకోవడం ద్వారా పిల్లల్లో ఒత్తిడి తగ్గడంతో పాటు వారికి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. నలుగురిలో కలిసిపోయే గుణం అలవడుతుంది. చిత్రలేఖనం, గానం, డ్యాన్సింగ్, సంగీత శిక్షణ ఇలా అన్నీ నేర్పిస్తాం. వీటి ద్వారా నలుగురిలో ధైర్యంగా మాట్లాడే తత్వం విద్యార్థుల్లో మెరుగవతుంది.' -సంగెం రాధాకృష్ణ నృత్య ఉపాధ్యాయులు
గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులు బాలభవన్‌లో శిక్షణ కోసం చేరగా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తమ పిల్లలను కూడా శిక్షణ కోసం చేర్పించడం.. మరింత ఆసక్తికరంగా మారింది.
ఇవీ చదవండి: పోలీసు ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరి.. అప్లై చేశారా?
క్రికెట్ వ్యాపారంలోకి సత్య నాదెళ్ల.. ఐపీఎల్ వైపు చూస్తారా..?