హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్(Huzurabad by election 2021) ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. ఏదైనా సమస్య ఉన్నా... మావద్ద అందుకు తగ్గ అధికారులు, పోలీస్ బలగాలు ఉన్నాయని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
కమలాపూర్‌లో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన సీఈవో శశాంక్ గోయల్ తనిఖీ చేశారు. 306 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని తెలిపారు. ఇప్పటివరకు 88 ఫిర్యాదులు అందాయని చెప్పారు. వాటిపై ఎన్నికల పరిశీలకులు వివరాలు సేకరిస్తున్నారని అన్నారు.డబ్బు పంపిణీపై ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. విచారణలో నిజాలు తేలితే ఎన్నికల తర్వాత కూడా చర్యలు ఉంటాయని తెలిపారు.
2018 ఎన్నికల్లో హుజూరాబాద్‌లో 84.5 శాతం ఓటింగ్ నమోదైందని తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో ఎంత శాతం పోలింగ్ నమోదవుతుందని చెప్పడం సాధ్యం కాదని పేర్కొన్నారు. కానీ... ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నట్లు వెల్లడించారు. ఓటింగ్ శాతం పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచారం ముగిశాక కూడా ఇతర ప్రాంతాలవారు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిలో కొన్ని ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే పనులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డబ్బుల పంపిణీ ఆరోపణలపై ఎప్పటికప్పుడు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: Huzurabad by elections 2021: స్వేచ్చగా ఓటెయ్యండి... ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: గెల్లు శ్రీనివాస్