సింగరేణిలో రెండో రోజు సమ్మె కొనసాగుతోంది. కొంత మంది కార్మికులు బందోబస్తు మధ్య విధులకు హాజరవుతున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండంలో కార్మికులు రెండోరోజూ.. విధులకు హాజరుకాలేదు. బొగ్గు గనుల్లో కార్మికులు లేక బోసిపోయాయి. తెరాస అనుబంధ సంస్థ బొగ్గుగని కార్మిక సంఘంకు చెందిన కొంతమంది మాత్రం సమ్మెలో పాల్గొనలేదు. వారు విధులకు హాజరయ్యారు. మరోవైపు ఆ జిల్లా కార్మికులు ఈ సమ్మె.. కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు.
రామగిరి ఆర్జీ3 వద్ద టీబీజీకే అనుబంధ కార్మికులు విధుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. మిగతా కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు. విధుల్లోకి వెళ్తోన్న కార్మికులను అడ్డుకుని ఆందోళన చేపట్టిన జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంచిర్యాల జిల్లాలోని కార్మికులు మాత్రం తాము ఒకరోజు మాత్రమే నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. 3 రోజుల సమ్మెతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతామని.. అందుకే ఈ నిర్ణయమని వెల్లడించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్మికులు సైతం సమ్మెలో పాల్గొన్నారు. భూపాలపల్లి డివిజన్లో 6వేల 800 కార్మికులు పనిచేస్తుండగా.. అత్యవసర సిబ్బంది మినహా అందరూ విధులకు హాజరుకాలేదు. దీనితో 7వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. సంస్థకు 3 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లనుంది. సమ్మె నేపథ్యంలో భూపాలపల్లి బంద్‌కు అఖిలపక్షం నేతలు పిలుపునిచ్చారు. పలుచోట్ల విధుల్లోకి వెళ్తున్న కార్మికులను అడ్డుకున్న నాయకులను.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి:జులై 6 నుంచి తాజ్ సందర్శనకు అనుమతి