కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలకు ఆలస్యంగా నోటిఫికేషన్ వచ్చినా.. ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది. ఆదివారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 423 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 1022 నామపత్రాలు సమర్పించారు. ఆదివారం చివరిరోజు కావడం వల్ల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇవాళ్టి నుంచి నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
అభ్యర్థులు తమ మద్దతుదారులను వెంట తీసుకుని ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్ 51వ డివిజన్ నుంచి నామ పత్రాలను దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా పేట రమేశ్ నామినేషన్ వేశారు.
2014లో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో దాఖలైన పత్రాల కంటే ఈసారి ఎక్కువగా నమోదయ్యాయి. గతంలో 50 డివిజన్లకు 785 నామపత్రాలు దాఖలు కాగా.. ఈసారి 60 డివిజన్లకు ఒక వెయ్యి 22 దాఖలయ్యాయి. విలీన గ్రామాల నుంచి మరింత మంది పోటీకి ఆసక్తి చూపారు.
ఇదీ చదవండి: విజిలెన్స్ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించండి: పృథ్వీరాజ్